ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుద్ది : రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య 

ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుద్ది : రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య 
  • స్టూడెంట్లతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తాం 
  • రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరిక 

బషీర్​బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం స్టూడెంట్ల ఫీజు బకాయిలు చెల్లించకపోవడం దారుణమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. తక్షణమే బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని, స్టూడెంట్లతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యాన్యువల్​ఎగ్జామ్స్​దగ్గర పడడంతో హాల్​టికెట్లు అందుతాయో లేదో అని స్టూడెంట్లు ఆందోళన చెందుతున్నారన్నారు. ఫీజులు చెల్లించేదాకా కాలేజీ యాజమాన్యాలు హాల్​టికెట్లు ఇవ్వడం లేదన్నారు. 15 నెలలుగా విద్యా శాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు అన్నారు.

కాంగ్రెస్​అధికారంలోకి వచ్చాక తెచ్చిన అప్పులు లక్షా 50 వేల కోట్లు అయితే ఆదాయం లక్షా 20 వేల కోట్లు ఉందన్నారు. ఇందులో కాంట్రాక్టర్లకు, ఇతర బిల్లులకు ఎంత చెల్లించారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌‌మెంట్​పథకం ఎత్తివేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దశల వారీగా 4 వేల కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హాస్టల్స్ కు సొంత భవనాలు నిర్మించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు నీల వెంకటేశ్, బీసీ నాయకులు పాల్గొన్నారు.