- రాహుల్ పై ఆరోపణలను ఖండిస్తున్నాం
ఖమ్మం టౌన్, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం ఈనెల 26 నుంచి అమలు చేయబోతున్న నాలుగు పథకాల్లో ఒకటైన రైతుభరోసాపై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలకు రాష్ట్రంలో ప్రజా భరోసా లేదని రాజ్యసభ సభ్యురాలు రేణుకా సౌదరి ఎద్దేవా చేశారు. శనివారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ సర్కిల్ లోని ఆయన విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పై సోషల్ మీడియా వేదికగా కొందరు దుష్ప్రచారం చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. మోదీ సర్కారు వన్ నేషన్, వన్ ఎలక్షన్ అమలు వైఫల్యమైందని, ఇందుకు వెస్ట్ బెంగాల్ ఎన్నికలే నిదర్శనమని తెలిపారు. రాహుల్ గాంధీపై చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. మాజీ దేశ ప్రధాని మనోహ్మన్ సింగ్ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశానికి ఆదర్శమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్, బీజేపీలు ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పడితే రైతాంగం నాన్ ఫెస్టి సైడ్, ఆర్గానిక్ ఫామ్ పంటలను పండించడం వల్ల కార్గో సర్వీస్ ద్వారా ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవచ్చని తెలిపారు. అంతకుముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి నిమిషం పాటు మౌనం పాటించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సిటీ మేయర్ నీరజ తదితరులు పాల్గొన్నారు.