బీసీలకు బీఆర్​ఎస్సే అండ : వద్దిరాజు రవిచంద్ర

  • ఎంపీగా నామాను గెలిపించుకోవాలని పిలుపు

ఖమ్మం టౌన్, వెలుగు :  బీసీలకు అండగా ఉండేది బీఆర్ఎస్ పార్టీయేనని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. రాబోయే పార్లమెంట్​ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావును గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఖమ్మం సిటీ  బైపాస్ రోడ్డులో ని గాయత్రి గ్రౌండ్ లో గురువారం ‘కేసీఆర్ కు కృతజ్ఞత సభ’ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు. 

ఈసందర్భంగా వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులుగా తనను  రెండోసారి నామినేట్ చేసిన మాజీ సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీలకు కేసీఆర్​ అన్నిరకాల అవకాశాలు కల్పించారని తెలిపారు. కానీ ఇక్కడ మనలో విభేదాలు, ఆధిపత్యం కారణంగా ఒక్క సీటు మాత్రమే వచ్చిందని చెప్పారు.  వచ్చే ఎన్నికల్లో వంద సీట్లకు తగ్గకుండా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

బీఆర్ఎస్  రాష్ట్రమంతటా బీసీలకు సముచిత స్థానం కల్పిస్తే కాంగ్రెస్ బీసీలను విస్మరిస్తున్నదని పువ్వాడ పేర్కొన్నారు. తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని, మాజీ సీఎం కేసీఆర్ కు అందరం కృతజ్ఞతగా ఉండాలని  నామా నాగేశ్వరరావు అన్నారు.  పార్లమెంట్​ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, మదన్ లాల్, హరి ప్రియ, తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.