ఖమ్మం, వెలుగు: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ నోరు అదుపులో పెట్టుకోవాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. శనివారం ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవితపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పసుపు బోర్డు సహా నిజామాబాద్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఫెయిలైన అరవింద్, వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇలాంటి విమర్శలు చేస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని, ముందు వాటిని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేసి మాట్లాడాలని హితవు పలికారు. ఎనిమిదేళ్ల నుంచి రాష్ట్రం ప్రశాంతంగా ఉండడాన్ని తట్టుకోలేక, కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు అర్వింద్ ప్రయత్నిస్తున్నారని ఫైరయ్యారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ విభేదాలకు మున్నూరు కాపు కమ్యూనిటీని తెరపైకి తెచ్చి లబ్ధి పొందాలని ప్రయత్నించడం సరైంది కాదన్నారు. మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు పారా నాగేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల గాంధీ, కోశాధికారి జాబిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.
రామయ్యకు సువర్ణ తులసీదళార్చన
భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామికి శనివారం సువర్ణ తులసీదళాలతో అర్చన జరిగింది. గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చిన అర్చకులు ముందుగా గర్భగుడిలో సుప్రభాత సేవ చేసి బాలబోగం నివేదించారు. రామపాదుకలకు భద్రుని మండపంలో పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం సీతారాములను అలంకరించి బంగారు తులసీ దళాలతో అర్చన నిర్వహించారు. భక్తులు ఈ అర్చనలో పాల్గొన్నారు. కల్యాణమూర్తులకు ప్రాకార మండపంలో నిత్య కల్యాణం జరిగింది. మాధ్యాహ్నిక ఆరాధనల తర్వాత రాజబోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవ చేశారు.
అన్నదానానికి రూ.5లక్షల విరాళం
శ్రీసీతారామచంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి శనివారం రూ.5 లక్షలు విరాళంగా ఇచ్చారు. సూర్యదేవర శ్రీనివాస్ తన తల్లిదండ్రులు సూర్యదేవర సుబ్బయ్య, అనసూర్యమ్మల పేరిట ప్రతీ రోజు భక్తులకు అన్నదానం చేయాలని కోరుతూ ఈ విరాళం సూపరింటెండెంట్ కత్తి శ్రీనివాసరావుకు అందజేశారు.
దళారులకు వడ్లు అమ్ముకోవద్దు
అన్నపురెడ్డిపల్లి, వెలుగు: గ్రామాల్లోకి వచ్చే దళారులకు వడ్లు అమ్మకుండా కొనుగోలు కేంద్రాలకు తేవాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు సూచించారు. శనివారం రాజాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొనుగోలు సెంటర్‌కు రైతులు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే కాంటా వేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. వడ్ల డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతాయని తెలిపారు. అనంతరం అన్నపురెడ్డిపల్లి రైతు వేదికలో 21 మంది కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. సర్పంచ్ పద్మ, జడ్పీటీసీ లావణ్య భారతి, సొసైటీ చైర్మన్ సుధాకర్ రావు, వైస్ ఎంపీపీ రామారావు, ఉప సర్పంచ్ పర్సా వెంకట్, తహసీల్దార్ భద్రకాళి పాల్గొన్నారు.
కలాం సేవలు స్ఫూర్తిదాయకం
సత్తుపల్లి, వెలుగు: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని ఎంపీ డా. బండి పార్థసారథిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని గంగారం సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి తరం విద్యార్థులు అబ్దుల్ కలాం జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని సాంకేతిక రంగాలతో పాటు రాజకీయ రంగంలో రాణించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం పట్టణంలో లైబ్రరీ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకెళ్లాలని సూచించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ తాతా మధు, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపుడి మహేశ్, తోట సుజల రాణి, మట్టా ప్రసాద్, అనిల్, ప్రవీణ్ పాల్గొన్నారు.
వైరా ఫొటో గ్రాఫర్ కు అవార్డు
వైరా, వెలుగు: తెలంగాణ ఫొటో, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్, ఫొటోటెక్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ కేబీఆర్ కన్వెన్షన్ లో నిర్వహించిన ఫొటో ఎగ్జిబిషన్లో వైరాకు చెందిన ముత్యాల నాగేశ్వరరావు ఉత్తమ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ గా ఎంపికయ్యాడు. అవార్డును సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్, తెలుగు సినిమాటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ విందా అందజేశారు.
పర్యావరణం దెబ్బ తినకుండా చూడాలి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ప్రజలకు, పర్యావరణానికి హాని కలగకుండా బొగ్గు ఉత్పత్తి సాధించాల్సిన అవసరం ఉందని సింగరేణి డైరెక్టర్లుఎస్ చంద్రశేఖర్, డి సత్యనారాయణ చెప్పారు. కొత్తగూడెంలో మైనింగ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, సింగరేణి చాప్టర్ ఆధ్వర్యంలో శనివారం జాతీయ స్థాయి సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2030 నాటికి 1,500 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాదించేలా ప్లాన్ చేయాలని అన్నారు. భూమి పొరలను పేల్చడం ద్వారా పర్యావరణానికి, ప్రజలకు నష్టం కలుగుతోందని, దీనిని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నా పూర్తి స్థాయిలో ఫలితం రావడం లేదన్నారు. మైనింగ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మధుసూధన్, కన్వీనర్ సీహెచ్ నర్సింహారావు, కో కన్వీనర్ సునీల్‌వర్మ పాల్గొన్నారు.
రాజకీయాలకతీతంగా డెవలప్ చేస్తున్నా
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: రాజకీయాలకతీతంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. లక్ష్మీదేవిపల్లిలోని మామిడితోటలో శనివారం నిర్వహించిన కార్తీక వన సమారాధనలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్‌లో ఆయన మాట్లాడారు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలను జంట నగరాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక నిధుల కోసం కృషి చేస్తున్నానని తెలిపారు. ఇప్పటికే కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లోని ప్రధాన రోడ్డుపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామని, శాశ్వత నీటి ఎద్దడి నివారణలో భాగంగా రూ.110 కోట్లతో ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపినట్లు చెప్పారు. వనమా రాఘవ పుట్టిన రోజు సందర్భంగా పలువురు యువకులు రక్తదానం చేశారు. జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, మున్సిపల్ చైర్ పర్సన్ కె సీతాలక్ష్మి పాల్గొన్నారు.
బాలల రక్షణ అందరి బాధ్యత
భద్రాచలం, వెలుగు: చైల్డ్ లైన్–1098 ఆధ్వర్యంలో భద్రాచలంలో శనివారం బాలల స్నేహపూరిత వారోత్సవాలు ఘనంగా జరిగాయి. బాలల వేధింపుల నిర్మూలనా దినోత్సవం సందర్భంగా స్థానిక కాలేజీ గ్రౌండ్లో వాకర్స్ కు అవగాహన కల్పించారు. అనంతరం కేజీబీవీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నీలిమ మాట్లాడుతూ బాలల హక్కులు, వారి రక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని అన్నారు. చైల్డ్ లైన్సే దోస్తీ రిస్ట్ బ్యాండ్, వాల్‌పోస్టర్లను రిలీజ్ చేశారు. సీఐ నాగరాజురెడ్డి, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ రాజ్‌కుమార్, ఎంఈవో సమ్మయ్య, సీడీపీవో సలోమి పాల్గొన్నారు.
పోడు గ్రామసభలు నిర్వహించాలి
ఖమ్మం టౌన్, వెలుగు: పోడు భూముల హక్కుపత్రాలు జారీ చేసేందుకు సోమవారం నుంచి గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలు, రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో గ్రామసభల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వేను సజావుగా నిర్వహించిన అధికారులను అభినందించారు. జిల్లాలోని 94 గ్రామ పంచాయతీల్లోని 132 గ్రామాల్లో 18,295 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 17,616 దరఖాస్తులను పరిశీలించడం జరిగిందని చెప్పారు. మిగిలిన వాటిని కూడా కంప్లీట్ చేయాలని ఆదేశించారు. ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు, అడిషనల్ కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్ మధుసూధన్, డీఎఫ్‌వో సిద్ధార్థ్విక్రమ్సింగ్ పాల్గొన్నారు.