- దక్షిణాది రాష్ట్రాల నుంచి భారీగా తరలి రావాలని పిలుపు
బషీర్ బాగ్, వెలుగు: చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఫిబ్రవరి 6, 7 తేదీల్లో ఢిల్లీలో ఓబీసీ జాతీయ సదస్సులు నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య తెలిపారు. చలో ఢిల్లీ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి ఓబీసీలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సోమవారం కాచిగూడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బోను దుర్గా నరేశ్యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ తో కలిసి చలో ఢిల్లీ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ .. చట్టసభల్లో బీసీ బిల్లు కోసం ఫిబ్రవరి 6, 7 తేదీల్లో ఢిల్లీలో ఓబీసీ జాతీయ స్థాయి సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. పలు రాజకీయ పార్టీల ఎంపీలు, నేతలు పాల్గొంటారని చెప్పారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని కోరారు. విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ను తొలగించాలన్నారు. రూ.2 లక్షల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలన్నారు. బీసీ నేతలు రంగు విక్రమ్, తంగెళ్లముడి నందగోపాల్, వేముల రామకృష్ణ, సుగుణ, గొరిగె మల్లేశ్, చింత శ్రీనివాస్, రఘుపతి, వర ప్రకాశ్, రవి, రాందేవ్, గోపి తదితరులు పాల్గొన్నారు.