
- బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు సపోర్ట్ చేస్తది
- కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ స్వయంగా చెప్పారు
- లోకల్బాడీల్లో పెంచిన బీసీ రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరుగుతయ్
- బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాహుల్, రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంది
- వీ6 న్యూస్ ‘ఇన్నర్వ్యూ’లో వెల్లడి
హైదరాబాద్, వెలుగు : దేశవ్యాప్తంగా జనగణనతోపాటు కులగణనకు బీజేపీ ఒప్పుకుంటుందని.. బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచే బిల్లుకు అసెంబ్లీలో, పార్లమెంటులో మద్దతిస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు, బీసీలకు బీజేపీ ప్రయారిటీపై వీ6 ‘‘ఇన్నర్వ్యూ’’లో మాట్లాడారు.
వీ6 : రాష్ట్రంలో ఇన్నేండ్లుగా బీసీలు చేస్తున్న పోరాటానికి.. ఇప్పుడు ఫలితం దక్కుతున్నట్టేనా?
కృష్ణయ్య: ప్రస్తుతం ఫలితం దక్కుతున్నది.. ఇది మంచి పరిణామం. లోకల్బాడీల్లో బీసీల రిజర్వేషన్లను గత ఎన్నికల సమయంలో 34 శాతం నుంచి 21 శాతానికి, కొన్ని చోట్ల 20, ఇంకొన్నిచోట్ల 18 శాతానికి తగ్గించారు. బీసీ రిజర్వేషన్లు జనాభా సంఖ్య ప్రకారం పెంచాలని ఉద్యమించాం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇందుకోసం కులగణన చేపట్టింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయంలో చిత్తశుద్ధితో ఉన్నరు. అయితే బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును అసెంబ్లీలో ఆమోదించి.. పార్లమెంటుకు పంపాలి. రాజ్యాంగంలోని 242 ఆర్టికల్ ప్రకారం.. ఒక రాష్ట్రంలో లోకల్‌బాడీ రిజర్వేషన్లను ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించుకోవచ్చు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై మాత్రమే పార్లమెంటులో చట్టం చేయాల్సి ఉంటుంది.
ప్రభుత్వం దగ్గర సర్వే లెక్కలున్నాయి. వాటి ప్రకారం ముందుకెళ్లొచ్చు కదా?
ప్రభుత్వం తీసిన లెక్కలు స్పష్టంగా లేవు. దాని ప్రకారం రాష్ట్రంలో 3.55 కోట్ల జనాభా మాత్రమే ఉందంటున్నరు. ఆధార్ డేటా ప్రకారం 2022 వరకు రాష్ట్రజనాభా 3.85 కోట్లు. ప్రస్తుతం 4 కోట్లు దాటి ఉంటుంది.
బీసీ బిల్లు కోసం రాష్ట్రం ఏం చేయాలి?
బీసీ రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేస్తే.. ప్రస్తుతం రాజ్యాంగంలో ఉన్న నిబంధనల మేరకు సరిపోతుందని భావిస్తున్న. పార్లమెంటులో బిల్లు పెట్టాల్సిన అవసరం వస్తే రావొచ్చు కూడా. ప్రభుత్వం దీనిపై న్యాయనిపుణులతో చర్చించాలి.
పార్లమెంటులో బిల్లు పెడితే సపోర్ట్ చేస్తరా?
బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఇదివరకే చెప్పారు. కేంద్ర మంత్రులైన వారికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాల్లో పాత్ర ఉంటుంది. అలాంటి వారే బిల్లు పెడితే సపోర్ట్ చేస్తామని తెలిపారు.
బిల్లులో ముస్లింలను చేర్చితే.. ఆమోదించేది లేదు అని బండి సంజయ్ అంటున్నరు.
బిల్లుకు సపోర్ట్ చేస్తామని కిషర్‌రెడ్డి, బండి సంజయ్ స్వయంగా తెలిపారు. వాళ్లు ఒప్పుకున్నరు కనుక చేస్తరు. అయితే మత ప్రాతిపదిక రిజర్వేషన్లు ఉండొద్దనేది బీజేపీ పాలసీ. మొత్తం ముస్లిం కమ్యూనిటీని ఇందులో కలిపితే బీసీలకు నష్టం జరుగుతుందనేదే ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్న. అసెంబ్లీలో బిల్లు పెడితే మద్దతుపై కిషన్‌రెడ్డి నిర్ణయం ఇక్కడ ఫైనల్.
బయట పోరాటం చేస్తున్న మీరు.. రాజ్యసభలో ఈ విషయం లేవనెత్తొచ్చు కదా?
సభలో మాట్లాడే అవకాశం వచ్చిన ప్రతిసారి బీసీల అంశాలనే ప్రస్తావిస్తున్న. 33 శాతం మహిళా రిజర్వేషన్లలో.. 50 శాతం బీసీ మహిళా సబ్‌కోటా సాధ్యం అవుతుందా? సాధ్యమవుతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీనిపై హామీ ఇచ్చారు. స్వయంగా ఆయన పార్లమెంటులో కూడా తెలిపారు. మహిళా కోటాలో బీసీ మహిళలకు వాటాపై రెండో దశలో ఆలోచిద్దామని హామీ ఇచ్చారు.
భవిష్యత్తులో బీసీలకు బీజేపీ ఏం చేయబోతున్నది?
దేశసమగ్రత దెబ్బతినకుండా సమాజంలో పరివర్తన రావాలి అనేది బీజేపీ పాలసీ. అలాగే మేం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తమని అమిత్‌షా హామీ ఇచ్చారు.బీసీ కులగణనను చేసిన రాష్ట్ర సర్కార్, బీసీ రిజర్వేషన్ల పెంపుపై చట్టం కూడా చేయాలని నిర్ణయించింది. ఇప్పుడు బాల్ పార్లమెంటు కోర్టులోకి రానుంది. అక్కడ ఏం జరగనుంది?బీసీ కులగణనపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. అయితే వారు అనుసరించిన విధానంలో లోపాలు ఉన్నాయి. కులాల వారీగా జనాభా సంఖ్య తెలుసుకోవడం కులగణన ప్రధాన లక్ష్యం. అయితే సర్వేలో 77 ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఏముంది.
అకౌంట్లు, ఆస్తులు, ఎంత మంది భార్యలు? ఇలాంటి పూర్తి వ్యక్తిగత ప్రశ్నలు ఎందుకు పెట్టారు? వాటి వెనక ఉద్దేశం ఏంటి... ఇలా చేయడం వల్లే చాలా మంది సర్వేకు దూరంగా ఉన్నరు. రెండో సారి చేస్తున్న సర్వే కూడా లోపభూయిష్టంగా ఉంది. ఆన్లైన్లో, టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి వివరాలు వెల్లడించాలని అంటున్నరు. ఇంటికి వెళ్తేనే చెప్పని వాళ్లు ఇలాంటి పద్ధతుల్లో వివరాలిస్తారా? కేంద్రం చేసే జనాభా లెక్కలో 35 ప్రశ్నలే ఉంటాయి. మీరు ఎందుకు ఇన్ని ప్రశ్నలు పెట్టారు. ప్రభుత్వంలో కొంత మంది ఈ విషయంలో తప్పుడు పద్ధతులు అనుసరిస్తున్నట్టు స్పష్టమవుతున్నది.
జనగణనలో కేంద్ర ప్రభుత్వం క్యాస్ట్ కాలమ్ పెట్టే అవకాశం ఉందా?
జనగణనతో పాటు కులగణన చేసేందుకు బీజేపీ తప్పనిసరిగా అంగీకరిస్తుంది. ఆర్ఎస్ఎస్కూడా కులగణన జరపొచ్చని ఇదివరకే చెప్పింది. చాలా మంది ఎంపీలు కూడా ఈ విషయంపై హైకమాండ్‌కు సూచనలు చేస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నది. నిపుణులతో చర్చించి ప్రధానమంత్రి తుది నిర్ణయం తీసుకుంటారు.