
ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకురాలు, రాజ్య సభ ఎంపీ సుధామూర్తి ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. గురువారం (మార్చి 20) ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి పండుగను అందరం ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు.
దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆమె ఇఫ్తార్ విందుకు హాజరవ్వడం చర్చనీయాంశం అయ్యింది. ఇప్పటికే మహారాష్ట్ర నాగ్ పూర్ లో ఔరంగజేబు సమాధిని తొలగించాలనే ఆందోళనలు జరుగుతున్నాయి. ఇరువర్గాలు మతపరమైన విమర్శలు, వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో సుధామూర్తి ఇఫ్తార్ విందులో పాల్గొనటం విశేషం. ‘‘అందరం, అన్ని పండుగల జరుపుకుందాం’’ అని చెప్పడం చర్చనీయాంశం.
అదేవిధంగా.. రంజాన్ పండుగ ఇఫ్తార్ విందుకు హాజరవ్వడంపై అడిగిన ప్రశ్నకు ఆమె ఆలోచింపజేసే సమాధానం చెప్పారు. ‘‘ఇఫ్తార్ విందుకు వెళ్తే తప్పేంటి..? ప్రేమ, అభిమానంతో పిలిస్తే ఎక్కిడికైనా వెళ్తా. ఎవరి పండుగలకైనా వెళ్తా. చివరికి మీరు పిలిస్తే కూడా వస్తా. తప్పేముంది దాంట్లో..’’ అని అన్నారు. ఇతర మతాలపై ద్వేశం లేకుండా అందరం కలిసి ఉండాలని, కలిసి పండుగలు చేసుకోవాలని ఆమె పరోక్షంగా చెప్పినట్లు అందరూ భావిస్తున్నారు.