
రాకేష్ మాస్టర్ అలియాస్ ఎస్.రామారావు టాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్. 1968లో తిరుపతిలో జన్మించిన రాకేష్ మాస్టర్ హైదరాబాద్ లో మొదట ముక్కురాజు మాస్టర్ వద్ద కొన్ని రోజులు పనిచేశాడు. దాదాపు 1500 సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు. రవితేజ, ప్రభాస్, మహేశ్ బాబు, రామ్ వంటి స్టార్ హీరోలందరికీ కొరియోగ్రఫీ చేసిన ఘనత ఆయన సొంతం. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ కొరియోగ్రాఫర్ లుగా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లు రాకేష్ మాస్టర్ శిష్యులే.
రాకేష్ మాస్టర్ కు డాక్టరేట్
లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, సీతారామరాజు అమ్మో పోలీసోళ్ళు వంటి సినిమాలలోని పాటలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. అలాగే ఈటీవీలో వస్తున్న డ్యాన్స్ షో ఢీలో మాస్టర్ గా వ్యవహరించాడు. అదే విధంగా జబర్దస్త్ కామోడీ షోల్లో పలు ఎపిసోడ్ లలో పార్టిసిపెంట్ గా చేశారు. తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. 2020 సంవత్సరంలో గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్శిటీ వారు సేవా రంగంలో రాకేష్ మాస్టర్ కు డాక్టరేట్ ఇచ్చారు.
యూ ట్యూబ్ ఇంటర్వ్యూలతో హల్ చల్
పలు యూ ట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూలతో హల్ చల్ చేశారు. సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని చాలా మంది డ్యాన్స్ మాస్టర్స్ తన కెరీర్ నాశనం చేశారంటూ ఆరోపణలు చేసి యూట్యూబ్ లో ఫేమస్ అయ్యారు. రామ్ గోపాల్ వర్మ, శ్రీ రెడ్డి, ఎన్టీఆర్, బాలయ్య, మోహన్ బాబు, చిరంజీవి, మంచు లక్ష్మిలను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. అలాగే పుల్లయ్య అనే పల్లెటూరి కుర్రాడికి రాకేష్ మాస్టర్ డ్యాన్స్‌లో కొన్నాళ్లు శిక్షణ ఇచ్చాడు. కానీ ఆ కుర్రాడు ఆ శిక్షణను మధ్యలోనే ముగించి రాకేష్ మాస్టర్ పైనే వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయం సోషల్ మీడియాలో సంచలనాన్ని రేకెత్తించింది. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ శ్రీకృష్ణుడి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని యాదవ సంఘ నాయకులు రాకేష్ మాస్టర్ పై మే 2021 నెలలో హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
‘మ్యాన్షన్ హౌస్ మాయా హౌస్’ రియాల్టీ షో
రాకేష్ బిగ్ బాస్ షోకు పారడీగా ఈ మధ్యే ఒక యూట్యూబ్ ఛానెల్‌లో మ్యాన్షన్ హౌస్ మాయా హౌస్ అని ఒక రియాలిటీ షోను రాకేష్ మాస్టర్ మొదలుపెట్టారు. అగ్గిపెట్టి మచ్చ, స్వాతినాయుడు, సునిశిత్, ఉప్పల్ బాలు వంటి యూట్యూబ్ స్టార్లతో ఈ షోను నడిపిస్తున్నారు రాకేష్ మాస్టర్. విజయనగరం శివారులోని ఓ రిసార్ట్స్‌లో ఈ షో షూటింగ్ చేశారు. ఈ షో తర్వాత గబ్బర్ సింగ్ కామోడీ బ్యాచ్ తో ఓ షోను ప్లాన్ చేసినట్లు సమాచారం.
మల్టీ ఆర్గాన్ ఫెయిల్..
వారం రోజుల క్రితం వైజాగ్ లో షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ వచ్చిన రాకేష్ మాస్టర్ అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో ఇవాళ(ఆదివారం) గాంధీ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. డయాబెటిక్ పేషెంట్ కావడంతో పాటు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో సాయంత్రం 5 గంటలకు కన్నుమూశారు. రాకేష్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.