
- పొమ్మనలేక పొగబెట్టారని ఆవేదన
- కాంగ్రెస్లోకి రావాలని రేవంత్రెడ్డి ఫోన్
- బీఆర్ఎస్లోకి ఆహ్వానించిన కడియం
హనుమకొండ, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగిన ఏనుగల రాకేశ్ రెడ్డి ఆ పార్టీకి బుధవారం రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ స్టేట్ ప్రెసిడెంట్కిషన్ రెడ్డికి తన రాజీనామా లెటర్ ను పంపించారు. పార్టీ తనను పొమ్మనలేక పొగ బెట్టిందని, అసలు బీజేపీలో యువనాయకత్వానికి చోటే లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హనుమకొండ నక్కలగుట్టలోని హరితహోటల్ ఆయన మీడియాతో మాట్లాడారు. వరంగల్ వెస్ట్ టికెట్ దక్కకపోవడం పట్ల భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీ సిద్ధాంతం పేరు చెప్పి యువతను బానిసలుగా మార్చడం తప్ప యువతకు ప్రాధాన్యం ఇస్తున్నదేమీ లేదన్నారు.
2019 లో 4 ఎంపీ లు గెలిచిన తర్వాత బీజేపీకి మంచి అవకాశాలు ఉండేవని, కానీ వర్గపోరుతో పార్టీని భూస్థాపితం చేశారన్నారు. రాష్ట్రంలో పార్టీకి భవిష్యత్తే లేకుండా చేశారన్నారు. టికెట్అడిగిన పాపానికి తనను పక్కన పెట్టారన్నారు. బీజేవైఎం నేతగా అన్ని జిల్లాలు తిరిగి పార్టీకి వేల మంది కార్యకర్తలను తయారు చేశానని, 11 ఏండ్లలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక్క కంప్లైంట్ కూడా చేయలేదని ఆవేదన చెందారు. బీజేపీలో ప్రశ్నించే గొంతులను కోసేస్తున్నారని, నాడు దేవ్ సాంబయ్య నుంచి తన వరకు ప్రజా బలం ఉన్నోళ్లందరినీ అణచివేస్తూ వచ్చారన్నారు. తనను ఏ ఒక్కరూ ప్రస్తావించలేదని, మనోవేదనకు గురై రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
కాగా ఆయనకు పీసీసీ చీఫ్రేవంత్రెడ్డి బుధవారం సాయంత్రం ఫోన్చేశారు. కాంగ్రెస్ లోకి రావాలని కోరారు. అందుకు ఆయన కార్యకర్తలతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. మరోవైపు రాకేశ్ రెడ్డి ఆఫీస్కు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వెళ్లారు. బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. అందుకు రాకేశ్ రెడ్డి స్పందిస్తూ.. రెండు, మూడు రోజుల్లో తన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు.