చిగురుపాటి జయరాం హత్య కేసులో రాకేశ్ రెడ్డికి శిక్ష

హైదరాబాద్ : పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం (Chigurupati Jayaram) హత్య కేసులో నిందితుడు రాకేశ్ రెడ్డికి నాంపల్లి కోర్టు (Nampally Court) శిక్ష విధించింది. ఈ కేసులో నాంపల్లి కోర్టు రాకేశ్ రెడ్డికి జీవిత ఖైదు విధించింది. దాదాపు నాలుగేళ్ల పాటు విచారించిన న్యాయస్థానం ఇటీవల రాకేశ్ రెడ్డిని దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. హత్య కేసుకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు 23 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏ1గా రాకేష్ రెడ్డిని కోర్టు నిర్ధారించింది. 


2019 జనవరి 31న చిగురుపాటి జయరాం హత్యకు గురయ్యారు. ఈ కేసులో రాకేష్‌రెడ్డి (Rakesh Reddy), విశాల్‌, శ్రీనివాస్‌, రౌడీషీటర్‌ నగేష్‌ కీలక నిందితులుగా ఉన్నారు. జయరాం కేసులో 388 పేజీల చార్జిషీట్‌ను పోలీసులు కోర్టుకు సమర్పించారు. అందులో 12 మంది నిందితులను చేర్చారు. అంతేకాకుండా ఈ కేసులో ముగ్గురు పోలీసు అధికారులను కూడా నిందితులుగా పేర్కొనడం గమనార్హం. రాకేష్‌రెడ్డిని 1, విశాల్‌ను ఏ2, వాచ్‌మెన్ శ్రీనివాస్‌ను ఏ3, నగేష్‌ ఏ4గా సినీ నటుడు సూర్య ప్రసాద్ ఏ5గా పోలీసులు చేర్చారు. జయరాం మేనకోడలు శిఖాచౌదరిని 11వ సాక్షిగా చార్జిషీటులో పేర్కొన్నారు. ఆమె స్నేహితుడు సంతోష్ రావును కూడా సాక్షిగా చేర్చారు. పోలీసులు అందించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా నాంపల్లి కోర్టు శిక్ష ఖరారు చేసింది. నాలుగేళ్ల విచారణ తర్వాత నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది