తరగని ఆస్తినంతా దానం చేసి ఏం చేస్తున్నారంటే..

తరగని ఆస్తినంతా దానం చేసి ఏం చేస్తున్నారంటే..

రిచ్‌ లైఫ్‌ స్టైల్‌, తరగని ఆస్తి పాస్తులు వీటన్నింటిని దానం చేసి సామాన్యంగా బతుకుతుంటారు కొందరు. అచ్చం అలానే వాళ్లకున్న ఆస్తినంతా గోశాలకు దానం చేసి సన్యాస జీవితం గడుపు తున్నారు రాకేష్‌, లీనా సురానా దంపతులు. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ వీళ్ల ఊరు. ఎప్పటి నుండో రాకేష్‌ కుటుంబానికి  బంగారం, వెండి నగల దుకాణం ఉండేది. చదువు పూర్తయ్యాక ఆ బిజినెస్‌ని చూసుకుంటూ కోట్లు సంపాదించాడు రాకేష్​. కానీ, ఎంత సంపాదించినా ఏదో తెలియని వెలితి వెంటాడింది అతడ్ని. 


దారి వెతుకుతూ..
తనకు కావాల్సిన దానికోసం చాలారకాల దారుల్లో వెతికాడు. కానీ సమాధానం దొరకలేదు. రోజూ ఆధ్యాత్మిక ప్రవచనాలు వినేవాడు. ఒక రోజు ఆధ్యాత్మిక గురువు గురు మహేంద్ర సాగర్ మహరాజ్‌ చెప్పిన ప్రవచనాలు విన్నాడు. ‘నాకు కావాల్సిన దారి ఆధ్యాత్మికంలోనే ఉంది’ అనుకుని అతని శిష్యునిగా చేరాలనుకున్నాడు. అప్పుడే తనకున్న ఆస్తినంతా దానం చేసి సన్యాసం తీసుకోవాలనుకున్నాడు. తన ఆలోచనను భార్య లీనాకు చెప్పాడు. అమెరికాలో చదువుకున్నా ఆధ్యాత్మికం అంటే మొదటి నుంచి లీనాకు ఇష్టమే. అందుకే భర్త ఆలోచనకు తోడుంటా అంది. వాళ్లతో పాటు వాళ్ల కొడుకు, రాకేష్‌ తల్లి, లీనా చెల్లెలు కూడా అదే దారి ఎంచుకున్నారు.
 

ఆస్తి దానం చేసి...
అప్పటిదాకా సంపాదించిన డబ్బు, ఆస్తినంతా గురు మహేంద్ర సాగర్ ఆశ్రమంలో ఉన్న గో సంరక్షణశాలకు, అక్కడి ఆలయాలకు దానమిచ్చారు. తరువాత కుటుంబమంతా సన్యాసం తీసుకున్నారు. వీళ్లు చేసిన పనికి ఆ ఊరి ప్రజలు రథంలో ఊరేగించారు. సన్మానాలు చేశారు.
ఇలా ఎందుకు చేశారని రాకేష్‌ను అడిగితే ‘డబ్బు సంపాదించి సుఖంగా బతకడం ఒక్కటే జీవితం కాదు. మనం ఏంటో తెలుసుకోవడంలో కూడా జీవిత పరమార్థం ఉంది. అది ఆధ్యాత్మికంతో కూడా సాధ్యమే. ఈ విషయాలన్నీ స్వామీజీతో ఉన్నప్పుడు తెలుసుకున్నా. ఆవును దేవునిగా పూజించే మన దేశంలో వాటి మనుగడ కూడా కష్టంగా ఉంది. అందుకే వాటి సంరక్షణ కోసం గోశాలకు నా ఆస్తి మొత్తం దానం చేశాను’ అని చెప్పాడు.   

 

ఇవి కూడా చదవండి

కేర్ తీసుకోకపోతే పిల్లల్లో స్కిన్ ప్రాబ్లమ్స్

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నకిలీ దందా