- కామారెడ్డి జిల్లాలో ఐదేండ్లుగా మహిళల ఎదురు చూపులు
- పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
- పైసలిచ్చే వరకు ఉద్యమిస్తామని మహిళల హెచ్చరిక
కామారెడ్డి, వెలుగు: జిల్లాలో డ్వాక్రా మహిళా సంఘాలకు రావాల్సిన పావలా వడ్డీ, అభయ హస్తం పైసల కోసం ఎదురు చూపులే మిగులుతున్నాయి. ఐదేండ్లుగా పైసలివ్వక పోవడంతో పావలా వడ్డీ లోన్ల బకాయిలు రూ.92 కోట్లకు చేరుకున్నాయి. సభ్యులు కట్టిన అభయహస్తం పైసలు కూడా వారికి తిరిగి ఇవ్వడం లేదు. దీంతో కొన్ని రోజులుగా డ్వాక్రా సంఘాల మహిళలు ఆందోళన బాట పట్టారు. జిల్లాలో మొత్తం 16,794 మహిళ సంఘాలు ఉండగా ఇందులో 1,74,000 మంది మెంబర్లు ఉన్నారు. వీరు బ్యాంక్ లింకేజీ ద్వారా లోన్లు తీసుకుని వివిధ కార్య కలాపాలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయం, పశువుల పెంపకం, ఆయా వ్యాపారాలు మహిళలు చేస్తున్నారు. లోన్ తీసుకున్న సంఘాల సభ్యులు లోన్ పైసలతో పాటు, వడ్డీ పైసలు కూడా ప్రతి నెలా బ్యాంక్‌లో చెల్లిస్తున్నారు. ఆ తర్వాత పావల వడ్డీ సొమ్మును వారి అకౌంట్లలో ప్రభుత్వం జమ చేయాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రమే పావల వడ్డీ పైసలు మహిళలకు ప్రభుత్వం చెల్లించింది. 2018 నుంచి ఇప్పటి వరకు నయా పైసా పావల వడ్డీ సొమ్ము చెల్లించలేదు. సభ్యులే ప్రతి నెలా వడ్డీ భరిస్తున్నారు. గ్రూపుల్లో సభ్యుల్లో ఉన్న మహిళలు చెల్లించిన ‘అభయ హస్తం’ పైసలు కూడా తిరిగి ఇవ్వడం లేదు. స్ర్తీనిధి లోన్ల వడ్డీ కూడా ఇస్తలేరు. 2018 నుంచి ఇప్పటి వరకు తమకు పైసలు రాలేదని మహిళ సంఘాల సభ్యులు వాపోతున్నారు. మీటింగ్స్‌లో అధికారులను నిలదీస్తే రేపు మాపు వస్తాయని చెబుతున్నారన్నారు.
ఆందోళన బాటలో మహిళలు
పావలా వడ్డీ, అభయహస్తం, స్ర్తీ నిధి బకాయి పైసలు చెల్లించాలని కోరుతూ వారం రోజులుగా జిల్లాలో మహిళలు ఆందోళనలు చేస్తున్నారు. కామారెడ్డి నియోజక వర్గంలోని ఆయా మండల కేంద్రాల్లో బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. ఆఫీసర్లకు వినతి పత్రాలు ఇచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఇప్పటికే బీజేపీ నియోజక వర్గ ఇన్ చార్జి వెంకటరమణారెడ్డి ప్రకటించారు. 2018 లో కూడా బకాయిల చెల్లింపు కోసం మహిళలు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా వెంకటరమణారెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత రాష్ర్ట వ్యాప్తంగా గవర్నమెంట్ పావల వడ్డీ బకాయిలు చెల్లించింది. ఇప్పుడు కూడా మళ్లీ బకాయిల కోసం కామారెడ్డి నుంచే ఆందోళనలు చేపట్టారు.
మా పైసలు మాకివ్వట్లే
అభయహస్తం కోసం పైసలు చెల్లించాం. ఏండ్లు గడుస్తున్నా ప్రభుత్వం మా పైసలు మాకు కూడా ఇస్తలేదు. ప్రతి నెలా జరిగే గ్రూప్ మీటింగ్‌లో ఆఫీసర్లను అడిగితే వస్తాయని చెబుతున్నరు. కానీ ఎప్పుడు వస్తయనే విషయం చెప్పడం లేదు. మా పైసలు మాకు ఎందుకు ఇవ్వరు. - ధరణి బాలవ్వ, మాచారెడ్డి మండలం
వడ్డీ పైసలు వస్తలేవు
పావలా వడ్డీ వర్తిస్తుందని ప్రతి నెల లోన్ అమౌంట్ చెల్లిస్తున్నాం. ప్రభుత్వం మాత్రం మాకు పావలా వడ్డీ పైసలు తిరిగి ఇస్తలేదు. ఐదేండ్ల నుంచి బకాయిలు కడ్తనే లేదు. వెంటనే పావల వడ్డీ పైసలు మా అకౌంట్లలో జమ చేయాలి. -శ్యామల, భిక్కనూరు మండలం