- రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నరు
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
గజ్వేల్, వెలుగు : దేశంలో బీజేపీ బలబడడం అత్యంత ప్రమాదకరమని, ఆ పార్టీ మతోన్మాదం విచ్ఛిన్న రాజకీయాలకు పాల్పడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం గజ్వేల్‌లో ర్యాలీ నిర్వహించిన అనంతరం సీతారాం ఏచూరి ప్రాంగణంలో జరిగిన మహాసభలో ఆయన మాట్లాడారు. దేశంలో కులమతాలను రెచ్చగొడుతూ ప్రధాని మోదీ కాలం గడుపుతున్నారని, అంబానీ, ఆదానీలను ప్రోత్సహిస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఆదానీని అరెస్ట్ చేయాలని అమెరికా ప్రభుత్వం చెప్పినా, పార్లమెంట్‌లో చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబట్టినా మోదీ మౌనం పాటించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మోదీ కారణంగా దేశానికి భద్రత లేకుండా పోయిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ తమదేనన్నారు. పదేండ్లలో బీఆర్‌ఎస్ చేసిన తప్పులే రేవంత్‌రెడ్డి సైతం చేస్తున్నారన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్‌ల కోసం భూములు తీసుకోవడాన్ని అప్పుడు వ్యతిరేకించిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు లగచర్లలో రైతుల భూములు లాక్కుంటున్నారని విమర్శించారు.
రైతులకు అన్నం పెట్టే భూములను గుంజుకుంటే ఊరుకునేది లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫ్రీ బస్ మినహా మిగతా హామీలేవీ అమలు కాలేదన్నారు. రేవంత్‌రెడ్డి ఏడాది పాలనలో ప్రజలు అసంతృప్తిగానే ఉన్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మాజీమంత్రి కేటీఆర్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు నాగయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు, సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కామన్ గోపాలస్వామి, రాళ్లబండి శశిధర్, సందబోయిన ఎల్లయ్య సత్తిరెడ్డి, జి.భాస్కర్ పాల్గొన్నారు.