సెన్సేషనల్ డైరక్టర్ శంకర్ (Shankar), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ (Game Changer). సంక్రాంతి కానుకగా ఇవాళ శుక్రవారం (జనవరి 10న) పాన్ ఇండియా భాషల్లో రిలీజైంది. పొలిటికల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీని నిర్మాత దిల్ రాజు రూపొందించారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్తో సినిమాని నిర్మించారు.
ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. తమన్ మ్యూజిక్ అందించారు. ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్‌బస్టర్ తర్వాత మూడేళ్ల విరామం తీసుకున్న చరణ్ గేమ్ ఛేంజర్ మూవీతో హిట్ కొట్టాడా? డైరెక్టర్‌గా శంకర్ కమ్ బ్యాక్ ఇచ్చాడా? గేమ్ ఛేంజర్ సినిమాకి తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ అందించిన కథ ఎలా ఉంది? అనే తదితర విషయాలను పూర్తి రివ్యూలో చూద్దాం.
కథేంటంటే:
ఏపీలో సీఎం బొబ్బిలి సత్యమూర్తి (శ్రీకాంత్) మంచి పేరుతో పాలన కొనసాగిస్తాడు. కానీ, అతని ఇద్దరు కుమారులు బొబ్బిలి మోపిదేవి (ఎస్‌జే సూర్య), రామచంద్ర (జయరామ్) చేసే పనులు పెద్ద తలనొప్పిగా మారుతాయి. అభ్యుదయ పార్టీ పరంగా వారు సత్యమూర్తి పేరు ప్రతిష్టను దిగజారుస్తారు. అలా సీఎం బొబ్బిలి సత్యమూర్తి అనారోగ్య పాలవుతాడు. దాంతో అతని కుమారులిద్దరు సీఎం కుర్చీపై కన్నేస్తారు.
ఆ నేపథ్యంలో రామ్‌నందన్ (రామ్‌చరణ్) ఐపీఎస్ (IPS) నుంచి IAS గా మారి కలెక్టర్గా.. సొంత ఊరు వైజాగ్ జిల్లాకు వస్తాడు. అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులు, రౌడీలకు పర్ఫెక్ట్ రూల్స్తో ఐఏఎస్ అధికారిగా ఆట కట్టించే పనిలో ఉంటాడు. వ్యవస్థను పీడిస్తున్న అవినీతి మరియు అక్రమాలను సవాలు చేస్తూ.. న్యాయంగా ఎన్నికలను జరిపే లక్ష్యంతో పనిచేస్తుంటాడు.ఈ క్రమంలో రామ్ నందన్కి మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి (ఎస్.జె.సూర్య), అతని గ్యాంగ్‌తో యుద్ధం మొదలవుతుంది.
పదవుల కోసం ఆరాటపడే మోపిదేవి ముఖ్యమంత్రి పదవి కోసం ఎలాంటి ఎత్తులు వేశాడు? అడ్డొచ్చిన ఐఏఎస్ అధికారి రామ్‌నందన్‌ని అధికార బలంతో ఏం చేశాడు? సీఎం సత్యమూర్తి చనిపోతే ముఖ్య మంత్రి అవ్వొచ్చనే తన కుమారుడి ఉద్దేశం ఎంతవరకు వెళ్ళింది? కానీ చనిపోయేముందు సీఎం సత్యమూర్తి ఓ వీడియో చేసి.. రామ్ నందన్ తన వారసుడు అని, తనే సీఎం అవ్వాలని ఎందుకు చెప్పాల్సి వచ్చింది?
చివరకి రామ్ నందన్ సీఎం అయ్యాడా? అప్పన్న, పార్వతి (అంజలి) చేసిన పోరాటం ఏంటి.. వారికి ఏమైంది? కాలేజీలో తను ప్రేమించిన దీపిక (కియారా అడ్వాణీ) కోసం రామ్ నందన్ ఏం చేశాడు? అసలు రామ్ నందన్ ఐపీఎస్ (IPS) నుంచి IAS గా ఎందుకు మారాల్సి వచ్చింది? అనే తదితర విషయాలు తెలియాలంటే గేమ్ ఛేంజర్ సినిమాను థియేటర్లో చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
విజనరీ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న శంకర్ సినిమా అంటే అభిమానుల ఊహలు ఆకాశం. అలాంటి శంకర్ తొలిసారి తెలుగులో స్ట్రెయిట్ ఫిల్మ్ తీస్తున్నాడంటే ఇంకా చెప్పేక్కర్లేదు. దానికి తోడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో శంకర్ సినిమా అంటే ఆ లెక్కవేరు. సాధారణంగా శంకర్ తెరకెక్కించిన గత సినిమాలు చూసుకుంటే అవినీతి, రాజకీయ నేపథ్యంలో వచ్చాయి. అందులో ముఖ్యంగా ఒకే ఒక్కడు, శివాజీ, భారతీయుడు సినిమాలు ఓ మార్క్ క్రియేట్ చేశాయి. అవినీతి వ్యవస్థ ప్రక్షాళనపై శంకర్ సంధించిన కాన్సెప్ట్కి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ మూవీ కూడా పొలిటికల్ పాయింట్‌లో రావడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
Also Read : థియేటర్లలో నానా హైరానా సాంగ్ మిస్
ఓ యువ ఐఏఎస్ అధికారికీ, రాజకీయ నాయకుడికీ మధ్య జరిగే సమరం ఎలా ఉందనేది సినిమా కథని చెప్పుకోవొచ్చు. స్వచ్చమైన ప్రజా పాలనను సాగించే ఓ కలెక్టర్ కథగా శంకర్ ఈ సినిమాని తెరకెక్కించారు. సీఏం సీటు కోసం జరిగే కుట్రలు, రాజకీయాల్లోని ఎత్తుగడల మధ్య స్క్రీన్ ప్లే నడిచింది. ఇకపోతే మినిష్టర్ మోపినేనికి, ఐఏఎస్‌కు రామ్ నందన్ కి మధ్య గొడవలు ఎంతవరకు వెళ్లాయనేది సినిమా ప్రధాన కథగా వెళ్ళింది. ఇంటర్వెల్ ఎపిసోడ్‌తో మంచి ట్విస్ట్ ఇచ్చి సెకండాఫ్‌పై హైప్ క్రియేట్ చేయడంలో శంకర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. కాకపోతే లవ్ ట్రాక్‍ను శంకర్ ఆకట్టుకునేలా నడపలేకపోయారు. సునీల్‍తో ట్రై చేసిన కామెడీ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఫస్టాఫ్ కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ లో వచ్చే ఫైట్ చరణ్ ఫ్యాన్స్తో ఈలలు వేయిస్తుంది. సెకండాఫ్ మెప్పిస్తుంది.
ఎవరెలా చేశారంటే:
గేమ్ ఛేంజర్లో అప్పన్న, రామ్ నందన్‌గా రెండు పాత్రల్లో రామ్ చరణ్ అదరగొట్టాడు. ముఖ్యంగా అప్పన్న పాత్ర రామ్‌చరణ్ కెరీర్‌లోనే బెస్ట్ క్యారెక్టర్స్‌లో ఒకటిగా నిలుస్తుంది. ఎమోషన్ సీన్స్ లో బాగా నటించాడు. కియారా అడ్వాణీ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. లుక్స్ పరంగా ఆడియన్స్ ని మెప్పిస్తుంది. ఎస్‍జే సూర్య తన మార్క్ నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. అప్పన్న భార్య పాత్రలో అంజలి జీవించేసింది. శ్రీకాంత్, జయరాం, నవీన్ చంద్ర, సముద్రఖని, రాజీవ్ కనకాల,సునీల్, వైవా హర్ష తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక అంశాలు:
దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రాసుకున్న కథకు ఇంకాస్తా పదును పెట్టాల్సి ఉంది. విజనరీ డైరెక్టర్ శంకర్ తనదైన శైలిలో సామాజికాంశాల్ని బలంగా తెరపై చూపించాడు. తమన్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టారు. విలన్ మోపినేని సీన్లను బాగా ఎలివేట్ చేస్తూ వచ్చిన బిజియం కొత్తగా ఉంది. సాంగ్స్ ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ తిరు విజువల్స్‌తో సూపర్బ్ గా ఉన్నాయి. ఎడిటర్స్ సమీర్ మహ్మద్, రుబెన్ న్యాయం చేశారు. దిల్ రాజు నిర్మాణం ఉన్నతంగా ఉంది.