హైదరాబాద్: సినిమా తీయడం ఓ పెద్ద పనంటే.. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు లీకవ్వకుండా ఆపడం ఇండస్ట్రీలో మరో పెద్ద పనిగా మారింది. పాటలు, ట్రైలర్లు లీకైపోతున్నాయి. మరోవైపు షూటింగ్ స్పాట్ నుంచి కూడా కొన్ని సీక్రెట్స్ బైటికొస్తున్నాయి. రామ్ చరణ్ హీరోగా శంకర్ తీస్తున్న చిత్రాన్ని కూడా ఈ సమస్య వెంటాడుతోంది. ప్రస్తుతం ఈ ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ రాజమండ్రి చుట్టుపక్కల జరుగుతోంది. ఓపెన్ ప్లేస్‌లో సీన్స్ తీస్తుండటంతో జనం గుమిగూడుతున్నారు. సెల్‌ఫోన్స్‌లో ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఇలాంటి వారందరికీ నిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చింది టీమ్.
లొకేషన్‌లో ఫొటోలు, వీడియోలు తీసి ఎవరైనా పోస్ట్ చేస్తే, ఆ ఐడీని కనిపెట్టి యాక్షన్ తీసుకుంటామని మూవీ టీమ్ హెచ్చరించింది. మరి ఇప్పటికైనా ఈ లీకులు ఆగుతాయో లేదో చూడాలి. ఇక ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా మారే ఐఏఎస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు చరణ్. కియారా అద్వానీ హీరోయిన్. సునీల్, జయరామ్, అంజలి తదితరులు నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. దీని తర్వాత గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో నటించనున్న చరణ్.. త్వరలో డిజిటల్ ఎంట్రీ కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నాడని, ఇది ఒక అమెరికన్ హిట్ సిరీస్‌కి రీమేక్ అని టాక్.