ట్రైలర్ రిలీజ్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటా: గేమ్ ఛేంజర్ టీమ్‌కు అభిమాని సూసైడ్ లెటర్

ట్రైలర్ రిలీజ్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటా: గేమ్ ఛేంజర్ టీమ్‌కు అభిమాని సూసైడ్ లెటర్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ గేమ్ ఛేంజర్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా 2025, జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత చెర్రీ సోలోగా వస్తోన్న సినిమా కావడంతో గేమ్ ఛేంజర్‎పై చరణ్ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే.. సినిమా విడుదల తేదీ దగ్గరపడ్డప్పటికీ గేమ్ ఛేంజర్ మూవీ యూనిట్ ప్రమోషన్స్ జోరు పెంచలేదు. 

ఇప్పటి వరకు ఈ మూవీ నుండి టీజర్, పాటలు రిలీజ్ చేసిన మూవీ యూనిట్ ట్రైలర్‎ను విడుదల చేయలేదు. సినిమా విడుదలకు మరో 13 రోజుల సమయం మాత్రమే ఉన్నప్పటికీ ట్రైలర్ విడుదల చేయకపోవడం, ప్రమోషన్స్ షూరు చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు చెర్రీ ఫ్యాన్స్. ఈ క్రమంలోనే ఓ అభిమాని ఏకంగా గేమ్ ఛేంజర్ మూవీ యూనిట్‎ను బెదిరిస్తూ సూసైడ్ నోట్ రాశాడు. న్యూ ఇయర్ సందర్భంగా ట్రైలర్ అప్డేట్స్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ అభిమాని రాసిన సూసైడ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది.

 ‘‘గౌరవనీయులైన గేమ్ ఛేంజర్ మూవీ యూనిట్‎కు ఈశ్వర్ అనే చరణ్ అన్న ఫ్యాన్‎ని చింతిస్తూ రాయునది ఏమనగా.. సినిమా విడుదలకు ఇంకా 13 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. మీరు ఏ విధమైనటువంటి ట్రైలర్ అప్డేట్స్ ఇవ్వట్లేదు. కనీసం అభిమానుల ఎమోషన్స్ ను పట్టించుకోవట్లేదు. ఈ నెల ఆఖరు కల్లా ట్రైలర్ అప్డేట్ ఇవ్వకపోతే న్యూ ఇయర్ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేయకపోతే నేను ఆత్మహత్యకు పాల్పడతానని సవినయంగా తెలియజేసుకుంటున్నా.  ఇట్లు.. మీ విధేయుడు చరణ్ అన్న భక్తుడు ఈశ్వర్’’ అంటూ చరణ్ అభిమాని గేమ్ ఛేంజర్ మూవీ యూనిట్‎కు డెడ్ లైన్ విధించాడు. ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట వైరల్‎గా మారింది. మరీ అభిమానుల విజ్ఞప్తి మేరకు న్యూ ఇయర్ సందర్భంగా మూవీ యూనిట్ గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ చేస్తుందా లేదా అనేది చూడాలి.