
ఇటీవల స్టార్ హీరోలు కమర్షియల్ సినిమాలకంటే ప్రయోగాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందులోనూ హీరోకి ఏదైనా లోపం ఉండే చాలెంజింగ్ క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారు. దర్శకులు కూడా కంఫర్ట్ జోన్‌లో నుండి బయటకి వచ్చి.. హీరోలంటే అన్నిట్లోను పర్‌ఫెక్ట్‌గా వుండాల్సిన పని లేదని అంటున్నారు. కథకు అనుగుణంగా పాత్రను ఏదో ఒక లోపంతో డిజైన్ చేస్తున్నారు. ఆల్రెడీ ‘రంగస్థలం’లో రామ్ చరణ్ వినికిడి లోపం ఉండే పాత్ర చేసి నటనలో ఓ మెట్టు పైకి ఎక్కాడనే పేరు తెచ్చుకున్నాడు.
ఇప్పుడు మరో లోపంతో చరణ్ కనిపించనున్నట్టు తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చరణ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో తండ్రి పాత్రలో.. ప్రెజంట్‌లో కొడుకు పాత్రలో కనిపించనున్నాడట. అయితే.. ఇందులో ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే పాత్రకు నత్తి వుంటుందని తెలుస్తోంది. ఈ పాత్రని శంకర్ చాలా వెరైటీగా డిజైన్ చేశాడట. ఇలాంటి పాత్రలో రీసెంట్‌గా ‘లైగర్’ లో విజయ్ దేవరకొండ, ‘ఎఫ్ 3’లో వరుణ్ తేజ్, అంతకంటే ముందు ‘లవకుశ’లో ఎన్టీఆర్ మెస్మరైజ్ చేశారు.