2022లో ప్రముఖ దర్శకుడు జక్కన్న ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోలుగా నటించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా రూ.1300 కోట్లు (గ్రాస్) వసూలు చేసి టాలీవుడ్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో రెండో స్థానంలో నిలిచింది. అంతేగాకుండా పలు నేషనల్ మరియు ఇంటర్నేషనల్ అవార్డులు కూడా దక్కించుకుంది.
ఈ నేపథ్యంలో ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో ప్రతిభ కనబర్చి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నందుకు, సినీ రంగానికి చేసిన విశేషమైన సేవలకు గాను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)కి మరో అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ (Madame Tussauds Singapore) మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు బొమ్మను 2025 వేసవిలో ఆవిష్కరించనున్నారు.
అయితే, ఇందులో ఓ స్పెషాలిటీ ఉంది. రామ్ చరణ్ ప్రియమైన పెంపుడు జంతువు రైమ్ కూడా ఈ మైనపు బొమ్మలో కలిసి ఉండటం విశేషం. దాంతో క్వీన్ ఎలిజబెత్ 2 తర్వాత అంతటి ప్రాధాన్యత సాధించుకున్న స్టార్‌గా రామ్ చరణ్ నిలవనున్నారు. ఈ విషయానికి సంబంధించి చరణ్ మాట్లాడే వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో రామ్ చరణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రతిష్టాత్మకమైన సూపర్‌స్టార్ల లైనప్‌లో చేరడం నిజంగా గౌరవంగా భావిస్తున్నట్లు హీరో రామ్ చరణ్ తెలిపారు. "చిన్నప్పుడు అలా దిగ్గజ నటులను చూసి నేను ఆశ్చర్యపోయే వాడిని. ఏదో ఒక రోజు వారి మధ్య నేను కూడా ఉంటానని కలలో కూడా అనుకోలేదు. ఇది నాకొచ్చిన అద్భుతమైన అవకాశం. మేడమ్ టుస్సాడ్స్ ఇస్తున్న ఈ గుర్తింపు నా క్రాఫ్ట్ పట్ల కృతజ్ఞతతో ఉన్నాను" అని రామ్ చరణ్ వీడియో ద్వారా వెల్లడించారు.
అలాగే తన పెంపుడు జంతువైన రైమ్ గురించి చెబుతూ.. 'ఈ స్పెషల్ ఎక్స్‌పీరియన్స్‌లో రైమ్ నాతో చేరడం ఎంతో సంతోషంగా ఉంది. రైమ్ నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం, నా వ్యక్తిగత జీవితంతో ఎంతో ముడిపడి ఉన్న అంశం" అని చరణ్ తెలిపారు.
ప్రస్తుతం ఎవరెవరివీ ఉన్నాయంటే?
సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో ఇప్పటికే బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, హీరోయిన్ కాజోల్, దర్శకనిర్మాత కరణ్ జోహార్ వంటి దిగ్గజ భారతీయ సినీ తారల బొమ్మలు ఉన్నాయి. అంతేకాదు లండన్‌లో జరిగిన 2000 IIFAలో అమితాబ్ బచ్చన్ బొమ్మను ఆవిష్కరించి 25 ఏళ్లు పూర్తవుతున్నందున.. భారతీయ సినిమా ప్రపంచ స్థాయికి ప్రభావాన్ని చూపిస్తూ ఈ భాగస్వామ్యం పెరుగుతూనే వస్తోంది. కాగా క్వీన్ ఎలిజబెత్ II కాకుండా, పెంపుడు జంతువును కలిగి ఉన్న ఏకైక సెలబ్రిటీగా రామ్ చరణ్ ఉండడం ప్రత్యేకతను సంతరించుకుంది.
ఎప్పుడు అనౌన్స్ చేశారు?
అబుదాబిలో జరిగిన స్టార్-స్టడెడ్ 2024 ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) అవార్డ్స్‌లో ఈ ప్రకటన చేశారు. చలనచిత్ర రంగానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేసిన విశేషమైన సేవలకు, ప్రపంచవ్యాప్త ఆకర్షణకు గుర్తింపుగా రామ్ చరణ్‌కు "మేడమ్ టుస్సాడ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అవార్డు"ని అందించారు.
ఇకపోతే చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి కోలీవడ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఇటీవలే ఈ చిత్రంలోని సెకెండ్ సింగిల్ రా మచ్చా సాంగ్ రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ 2025 సంక్రాంతికి రిలీజ్ కానుంది.