డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ముంబై అంథేరీ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. 2018లో వర్మ సంస్థపై నమోదైన చెక్ బౌన్స్ కేసులో ముంబైలోని అంథేరీ మెజిస్ట్రేట్ కోర్టు (Andheri Magistrate's Court) సంచలన తీర్పును వెలువరించింది.
ఈ చెక్ బౌన్స్ కేసుపై గత ఏడేళ్లుగా విచారణ జరుగుతోంది. మంగళవారం (జనవరి 23న) తీర్పు వెలువరించాల్సి ఉండగా, దర్శకుడు వర్మ కోర్టుకు గైర్హాజరు అయ్యారు. దీంతో ముంబై అంథేరీ మేజిస్ట్రేట్ కోర్టు వర్మ అరెస్ట్ కోసం నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్‌బీడబ్ల్యూ) జారీ చేసింది. అయితే, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్‌లోని సెక్షన్ 138 ప్రకారం రామ్ గోపాల్ వర్మ దోషిగా నిర్ధారించారు.
ఫిర్యాదుదారుడికి మూడు నెలల్లోగా రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలని, లేదంటే అదనంగా మరో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాలని వర్మను ఆదేశించింది. 2018లో మహేష్‌చంద్ర మిశ్రా ద్వారా శ్రీ అనే సంస్థ వర్మ కంపెనీపై చెక్ బౌన్స్ కేసు దాఖలు చేసింది.
కేసు ఏమిటి?
2018లో మహేష్‌చంద్ర మిశ్రా ద్వారా శ్రీ అనే కంపెనీ చెక్ బౌన్స్ కేసు మొదలైంది. ఈ కేసు వర్మ సంస్థపై ఉంది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో వర్మ తన కార్యాలయాన్ని విక్రయించవలసి వచ్చింది. జూన్ 2022లో, వ్యక్తిగత గుర్తింపు బాండ్‌ను అమలు చేసి, రూ.5,000 నగదు భద్రతను చెల్లించిన తర్వాత కోర్టు వర్మను బెయిల్‌పై రిలీజ్ చేసింది.
అయితే, 2025 జనవరి22న వర్మ కోర్టుకు హాజరుకాకపోవడంతో శిక్ష విధిస్తూ మేజిస్ట్రేట్ వై.పి. పూజారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం జరిగింది. ఈ కేసులో వర్మ రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలి. లేదంటే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.