Ram Gopal Varma: సత్యపై ఒట్టేసి చెబుతున్నా.. అలా చేయకపోతే నన్ను కాల్చేయ్

Ram Gopal Varma: సత్యపై ఒట్టేసి చెబుతున్నా.. అలా చేయకపోతే నన్ను కాల్చేయ్

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తీసిన గ్రేటెస్ట్ మూవీస్లో ఒకటి 'సత్య'(Satya). ఈ మూవీ 1998లో రిలీజై చరిత్ర సృష్టించింది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ అండర్ వరల్డ్ గ్యాగ్ స్టార్ సినిమాలో జేడీ చక్రవర్తి, ఊర్మిళ మాటొడ్కర్, మనోజ్ బాజిపేయి కీ రోల్స్ చేశారు.

27 ఏళ్ల తర్వాత సత్య మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. శుక్రవారం జనవరి 17న థియేటర్లలో రీ రిలీజైన సత్య ప్రేక్షకుల మనసును కట్టిపడేస్తోంది. ఈ సినిమాని థియేటర్స్లో చూడని ఈ తరం ప్రేక్షకులు.. ఇపుడు చూస్తూ థ్రిల్ అవుతున్నారు. అంతేకాదు సత్యని మళ్ళీ థియేటర్లో చూసుకున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సైతం ఎమోషనల్ అవుతూ.. ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టాడు. ఈ సినిమా విజయం తనను అహంకారిగా ఎలా మార్చేసిందో చెబుతూ పెద్ద నోట్ రాస్తూ X లో పోస్ట్ చేశాడు. 

రామ్ గోపాల్ వర్మ మాటల్లోనే " 27 ఏళ్ల తర్వాత సత్యను మరోసారి థియేటర్స్లో చూస్తున్నప్పుడు ఎంతో భావోద్వేగం కలిగింది. సత్య మూవీ క్లైమాక్స్కి వచ్చేసరికి నాకు కన్నీళ్లు ఆగలేదు. ఆడియన్స్ ఎవరైనా చూస్తారని కూడా నేను ఆలోచించలేదు. ఆ కన్నీళ్లు సినిమా కోసమే కాదు.. ఆ తర్వాత జరిగిన పరిణామాల కోసం కూడా. సినిమా తీయడం అంటే.. ఎలాంటి బిడ్డకు జన్మనిస్తున్నామో నిజంగా తెలియదు. ఎందుకంటే ఒక సినిమా ముక్కలు ముక్కలుగా తయారవుతుంది. ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. అది మొత్తం రెడీ అయ్యాక.. ఆడియన్స్ దాని గురించి ఏమి మాట్లాడుకుంటున్నారో అనే దానిపై దృష్టి పెడతారు. అయితే, సత్య మూవీతో తాను సృష్టించిన అద్భుతాన్ని తాను పూర్తిగా ఆస్వాదించలేదని, దీనిని కేవలం మరో సినిమాగానే చూశానని..ఈ మూవీ సక్సెస్ తనను పూర్తిగా అహంకారిగా మార్చేసిందని రామ్ గోపాల్ వర్మ అన్నాడు.

ALSO READ | వివాదంలో రిషబ్ శెట్టి 'కాంతర'.. ఏం జరిగిందంటే..?

ఇక చివర్లో "సత్య చూసి హోటల్కు తిరిగి వచ్చిన తర్వాత చీకట్లో కూర్చొన్నాను. నా అంతటి తెలివి తేటలతో నేను సత్యలాంటి సినిమాను నా భవిష్యత్తు సినిమాల కోసం ఎందుకు ఓ బెంచ్‌మార్క్ చేసుకోలేదో నాకు అర్థం కాలేదు. ఆ సినిమాలోని విషాదం వల్లే కాదు.. అప్పటి నన్ను చూసుకొని కూడా నేను ఏడ్చాను. సత్య కారణంగా నన్ను నమ్మిన వారందరిని మోసం చేశానని కూడా నేను ఏడ్చాను. నేను ఆల్కహాల్ వల్ల తాగుబోతును కాలేదు. నా సక్సెస్, అహంకారంతో అలా అయ్యాను. ఇది నాకు రెండు రోజుల కిందటి వరకు కూడా తెలియదు" అని డైరెక్టర్ ఆర్జీవీ తెలిపారు. అంతటితో ఆగకుండా సత్య మూవీ తర్వాత తాను తీసిన సినిమాల్లో ఆ నిజాయతీ, చిత్తశుద్ధి లేవని కూడా ఆర్జీవీ స్పష్టం చేశాడు. ఇక భవిష్యత్తులో సత్య లాంటి సినిమా ఉంటుందనే నిజాన్ని మాత్రం సుదీర్ఘ పోస్ట్ ద్వారా వెల్లడించడం విశేషం.

ఈ పోస్ట్కి సత్య మూవీలో భీకూ మాత్రే పాత్ర పోషించిన హీరో మనోజ్ బాజ్‌పాయీ స్పందించారు. 'మీరు ఒక ప్రత్యేక ప్రతిభ కలిగి ఉన్న అరుదైన వ్యక్తివి.   మీరు స్వంత ప్రత్యేకతను కలిగి ఉన్నారు. ఏదేమైనా అందరూ ఆర్జీవీలు కాలేరని, మీరు మీరుగా ఉన్నందుకు ధన్యవాదాలు' అంటూ రిప్లయ్ ఇచ్చాడు. మనోజ్ మాటకు ఆర్జీవీ కూడా రిప్లై ఇస్తూ.. తాను మాట ఇచ్చినట్లుగానే కొత్త ఆర్జీవీని చూస్తావని అన్నాడు. ఒకవేళ అలా చేయకపోతే.. నువ్వు నా తలలో కాల్చి చంపెయ్" అని ఆర్జీవీ అన్నాడు.

సత్య సినిమా గురించి:

రామ్ గోపాల్ వర్మ యాక్షన్ చిత్రం తీయాలని ఉదేశ్యంతో సత్య సినిమాను మొదలుపెట్టారు. ఆ సమయంలో ముంబైలోని చాలా మంది రౌడీ షీటర్స్, గ్యాంగ్ స్టార్ గురించి అధ్యాయనం చేశాడు. వారి జీవితం కథలు తెలుసుకున్నాడు.అందుకే సత్య సినిమా చూస్తుంటే సినిమాలా కాకుండా నిజంగా చూస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. అందుకోసం రామ్ రోపాల్ వర్మ పడిన కష్టం చాలా ఉంది.

ఈ సినిమా రచనా సమయంలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, సౌరభ్ శుక్ల సహాయం అందించారు. ఆ తరువాత వారు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్స్ గా ఎదిగారు. 

సత్య సినిమాను కేవలం రూ.2.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. విడుదల తరువాత ఈ సినిమా ఏకంగా రూ.15 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 

ఇక ఈ సినిమాలో నటించిన జేడీ చక్రవర్తి, ఊర్మిళ, మనోజ్ బాజిపేయి నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా తరువాతే నటుడు మనోజ్ బాజిపేయి బాలీవుడ్ స్టార్ నటుడుగా ఎదిగాడు. 

ఈ సినిమాకు విశాల్ భరద్వాజ్, సందీప్ చౌతా సంగీతం అందించగా.. సందీప్ చౌతా నేపధ్య సంగీతాన్ని అందించాడు. 

సత్య సినిమా ఆరు ఫిలిం ఫేర్ అవార్డులు, ఒక నేషనల్ అవార్డు దక్కించుకుంది. 

సత్య సినిమాకి గాను ఉత్తమ సహాయ నటుడిగా మనోజ్ బాజిపేయి నేషనల్ అవార్డు అందుకున్నారు.

సత్య సినిమా విషయంలో ఇలాంటి విశేషాలు చాలానే ఉన్నాయి. ఇప్పటివరకు మీరు ఈ సినిమా చూడకపోతే వెంటనే చూసేయండి.