సక్సెస్​ తలకెక్కి తాగుబోతునైన.. ఎన్నో తప్పులు చేసిన ఇక మారుతా: రామ్ గోపాల్ వర్మ

సక్సెస్​ తలకెక్కి తాగుబోతునైన.. ఎన్నో తప్పులు చేసిన ఇక మారుతా: రామ్ గోపాల్ వర్మ
  • సక్సెస్​ తలకెక్కి తాగుబోతునైన..బూతు సినిమాలు తీసి జనం నమ్మకాన్ని వమ్ము చేసిన
  • డైరెక్టర్​ రాంగోపాల్​ వర్మ ఎమోషనల్​ పోస్ట్​
  •     27 ఏండ్ల కిందటి నా ‘సత్య’ మూవీని మళ్లీ చూస్తే నేనేంటో తెలిసొచ్చింది
  •     ఇన్నాళ్ల ప్రయాణం గుర్తొచ్చి కన్నీళ్లు ఆగలేదు
  •     సరిదిద్దుకోలేని తప్పులు,  అర్థంలేని ప్రయోగాలు చేసిన
  •     ఇకపై గొప్ప చిత్రాలే తీస్తానంటూ ప్రమాణం

హైదరాబాద్​, వెలుగు : రీల్​ లైఫ్​లో, రియల్​ లైఫ్​లో ఇన్నాళ్లూ తాను చేసిన తప్పులు ఏమిటో తెలుసుకున్నానని.. ఇక ముందు అలా జరగకుండా చూసుకుంటానని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. ‘‘విజయం, అహంకారంతో తాగుబోతునయ్యాను. నా కండ్లు నెత్తికెక్కడంతో అసభ్యకర చిత్రాలు, అర్థం పర్థం లేని ప్రయోగాలు చేశాను. నాపై జనం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను” అంటూ సోమవారం సోషల్ మీడియా వేదికగా ఆయన ఎమోషనల్‌‌‌‌‌‌‌‌ నోట్‌‌‌‌‌‌‌‌ విడుదల చేశారు. ఇకపై తన గౌరవం నిలబెట్టుకునే సినిమాలే తీస్తానని మాటిచ్చారు. 

రాంగోపాల్​ వర్మ దర్శకత్వంలో జేడీ చక్రవర్తి, మనోజ్ బాజ్‌‌‌‌‌‌‌‌పాయ్ లీడ్‌‌‌‌‌‌‌‌ రోల్స్‌‌‌‌‌‌‌‌లో 1998లో విడుదలైన  ‘సత్య’ సినిమాను ఇటీవల రీ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల కింద ఆ  సినిమా చూసి ఏడ్చేశానంటూ వర్మ ఎమోషనల్ అయ్యారు.  ‘‘27 ఏండ్ల తర్వాత ‘సత్య’ సినిమాను తిరిగి చూశాక తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి. సినిమా చూసినందుకే కాదు.. ఆ సినిమా తర్వాత నా ప్రయాణం గుర్తుకొచ్చి ఉబికొచ్చిన కన్నీళ్లు అవీ. సినిమా స్క్రీనింగ్ తర్వాత హోటల్‌‌‌‌‌‌‌‌కు తిరిగొచ్చి చీకట్లో కూర్చుంటే.. ‘సత్య’ చిత్రాన్ని నా భవిష్యత్తుకు బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్‌‌‌‌‌‌‌‌గా ఎందుకు తీసుకోలేదన్న బాధ కలిగింది. సినిమాలోని విషాదం చూసి మాత్రమే కాకుండా నన్ను నేను చూసుకుని ఏడ్చేశా. ఎంతో మంది నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాననే గిల్టీ ఫీలింగ్‌‌‌‌‌‌‌‌తో కన్నీళ్లు వచ్చాయి” అని ఆయన పేర్కొన్నారు.  

నా విలువ నేనే అర్థం చేస్కోలే

సక్సెస్, యారగెన్స్‌‌‌‌‌‌‌‌ తలకెక్కించుకుని తాగుబోతునయ్యానని.. రంగీలా, సత్య చిత్రాల విజయంతో కండ్లు నెత్తికెక్కి, తన విజన్‌‌‌‌‌‌‌‌ను కోల్పోయానని ఆర్జీవీ అన్నారు. ‘‘ప్రేక్షకులను ఏదో ఆశ్చర్యపరచాలని, గిమ్మిక్కులతో ఆకట్టుకోవాలని, అసభ్యకర సన్నివేశాలతో అర్థపర్థం లేని ప్రయోగాలు చేశాను. సాధారణ కథతోనూ మంచి ఎలివేషన్ ఉన్న సినిమాలు తీయొచ్చు. కానీ, నేను తీయలేదు. నేను తీసిన వాటిలో కొన్ని విజయం సాధించాయి. కానీ ‘సత్య’లో ఉన్న దమ్ము, నిజాయితీ వాటిలో లేవు. కొత్త తరహా చిత్రాలు చేయాలనే ఆలోచనతో నా కండ్లకు నేనే గంతలు కట్టుకున్నా. నా విలువను నేను అర్థం చేసుకోలేక దేని కోసమో పరుగులు తీశా. నేను నాటిన పూలతోట నా కాళ్ల కిందే నలిగిపోవడం గుర్తించలేకపోయాను” అని పేర్కొన్నారు. 

ప్రతి ఫిల్మ్​మేకర్​కు ఇదో మేల్కొల్పు

చేసిన తప్పులను ఎలాగూ సరిదిద్దుకోలేననని, ఇకపై దర్శకుడిగా తనను తాను  ఫస్ట్ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలబెట్టే సినిమాలే తీస్తానని రాంగోపాల్​ వర్మ ప్రకటించారు. ‘‘రెండు రోజులు కింద నా కన్నీళ్లు తుడుచుకుంటూ నాకు నేను ఇచ్చుకున్న వాగ్దానం ఇది. ‘సత్య’ లాంటి సినిమా మళ్లీ తీయలేకపోవచ్చు... కానీ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌,  జానర్ ఏదైనా ‘సత్య’పై చూపించిన నిజాయితీ ఇకపై ప్రతి సినిమాపై చూపిస్తా. ఇకమీదట ఏ సినిమా తీయాలనుకున్నా ముందు ‘సత్య’ మూవీ ఓ సారి చూస్తా. ఇదేదో ముందు నుంచి చేసి ఉంటే 90 శాతం తప్పుడు సినిమాలు తీసేవాడి కాదు. ప్రతి ఫిల్మ్ మేకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇదొక మేల్కొల్పుగా చెప్తున్నా. నా జీవితంలో మిగిలిన భాగం.. ‘సత్య’ లాంటి విలువైన సినిమాలు తీయడానికే వెచ్చిస్త. ‘సత్య’ చిత్రంపై ఒట్టేసి చెప్తున్న’’ అని వర్మ పోస్ట్ చేశారు.