యంగ్ హీరో రామ్ కార్తీక్ (Ram Kartik), కశ్వి (Kashvi) జంటగా మనోజ్ పల్లేటి (Manoj Palleti) దర్శకత్వంలో పి పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘వీక్షణం’ (Veekshanam). ఇవాళ శుక్రవారం అక్టోబర్ 18న థియేటర్స్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
మిస్టరీ థ్రిల్లర్ జానర్‌లో ఈ సినిమా తెరకెక్కింది. మనోజ్ పల్లేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రీమియర్ షోలు రిలీజ్ డేట్‌కు ఒకరోజు ముందే అంటే గురువారం (అక్టోబర్ 17) వేశారు. అలాగే టీజర్, ట్రైలర్ విజువల్స్ కూడా సినిమాపై అంచనాలు పెంచాయి. దానికి తోడు టీం ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయడంతో సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. మరి ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చాక ఎలాంటి టాక్ సొంతం చేసుకుందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే::
ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివసించే అర్విన్ (రామ్ కార్తీక్) చుట్టుపక్కల ఇళ్లలో ఏం జరుగుతుందో తెలుసుకునే ఆసక్తితో ఉంటాడు. తన బెడ్రూమ్ కిటికీ లోంచి బైనాక్యులర్ తో చుట్టూ ఉన్న ఇళ్లల్లో అమ్మాయిలను చూసే అలవాటు కూడా ఉంటుంది. అలా ఒక రోజు నేహా (కశ్వీ)ని చూసి ప్రేమలో పడతాడు. అనేక ప్రయత్నాలు చేసి మొత్తానికి నేహాను ప్రేమలోకి దింపుతాడు.
మరోవైపు తన ఎదురింట్లో దిగిన ఓ అమ్మాయి (బిందు నూతక్కి) రోజుకి ఒకరితో రావడం గమనిస్తాడు. వాళ్లని ఆమె దారుణంగా చంపడం చూస్తాడు. దీంతో ఆ వ్యక్తులందరూ మిస్సింగ్ అని తెలిసి ఆమెను పోలీసులకు పట్టించే ప్రయత్నం చేస్తాడు. అంతలోనే అతనికి చాలా షాకింగ్ నిజాలు తెలుస్తాయి. అసలు మర్డర్ చేసే అమ్మాయి చనిపోయి ఎనిమిది నెలలు అయిందని తెలుస్తోంది. దాంతో చనిపోయిన అమ్మాయి ఎలా హత్యలు చేస్తుందని ఆలోచించడం మొదలెడతాడు.
నిజంగా ఆ హత్యలు చేసేది ఎవరు? ఇక చనిపోయిన అమ్మాయి అర్విన్‌కు ఎలా కనిపించింది? ఆ అమ్మాయిది హత్యా? ఆత్మహత్యా? దీని వల్ల ఆర్విన్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? ప్రేమించిన నేహా అర్విన్ కి మళ్ళీ దగ్గరవుతోందా? లేదా అనే విషయాలు తెలియాలంటే థియేటర్లో వీక్షణం సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే::
" పక్కనోడి లైఫ్లో తలదూర్చకురా.. అసలు ఆ పక్కనోళ్ల గురుంచి నీకెందుకురా.. ఎవరి పని వారు చేసుకుంటే ఏ గొడవ ఉండదురా.. " ఇలా పలు సందర్భాల్లో మన మధ్యనే ఈ కామెంట్స్ వింటుంటాం. నిజానికి ఇండియాలో పక్కనోడి పనిమీదే ఆసక్తి చూపించే మనస్తత్వం ఉన్న జనాలు చాలానే ఉన్నారు. ఈ విషయం మీకు కూడా తెలిసిందే!
అయితే ఈ మాటలకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా వీక్షణం మూవీ స్టోరీ ఉంది. సరిగ్గా ఈ పాయింట్‌పైనే డైరెక్టర్ కథ రాసుకున్నట్లుగా సినిమా చూస్తే అర్ధమవుతోంది. పక్కవాడి లైఫ్ లో ఏం జరుగుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేసే హీరో.. సరిగ్గా ఆ ప్రయత్నంలో భాగంగానే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఆ ఇబ్బందులు ఏమిటి? ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత వాటిని ఎలా అధిగమించాడు? అనేది తనదైన కోణంలో తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. ఫస్టాఫ్ అంతా అర్విన్ చేసే పనులు, నేహాతో సాగిన ప్రేమ కథతో నడిపించి ఇంటర్వెల్ ముందు ఓ అమ్మాయి హత్యలు చేయడం చూపించి థ్రిల్ కలిగేలా చేశాడు. ఇక అసలు ఆ అమ్మాయే చనిపోయింది అని పోలీసులతో చెప్పి ఇంటర్వెల్ కి మంచి బ్యాంగ్ ఇచ్చి.. సెకండాఫ్ పై ఆడియన్స్ లో క్యూరియాసిటీని రేకిత్తించాడు డైరెక్టర్.
సెకండాఫ్ లో చనిపోయిన అమ్మాయి ఎలా హత్యలు చేస్తుంది? హత్యలు చేయబడ్డ అమ్మాయిలు ఎవరు అని హీరో అతని స్నేహితుల బృందం కనుగొనే ప్రయత్నం చేయడం ఆసక్తికరంగా అనిపిస్తుంది.. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే క్లైమాక్స్ పోర్షన్ అయితే రొటీన్‌కి భిన్నంగా సెకండ్ పార్ట్‌కి లీడ్ ఇచ్చేలా ఉండడం ఆడియన్స్ మైండ్ కి పనిపెడుతోంది. అంతేకాకుండా ఓఆర్‌డీ (ORD) అనే జబ్బు గురించి చెప్పి, చిన్నపాటి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు డైరెక్టర్.
ఎవరెలా చేశారంటే::
హీరో రామ్ కార్తిక్ ఒక సగటు కుర్రాడు పాత్రలోనటించి మెప్పించాడు. పక్క వాళ్ళ విషయాలను తెలుసుకోవాలనుకునే మనస్తత్వం ఉన్న కుర్రాడిగా అదరగొట్టాడు. హీరోయిన్ కశ్వి పర్లేదు. ఒకపక్క అందాల ఆరబోస్తూనే తనదైన యాక్టింగ్ తో మెప్పించింది. కీలక పాత్రలో కనిపించిన బిందు నూతక్కి మంచి రోల్ అని చెప్పొచ్చు. చనిపోయిన అమ్మాయి పాత్రలో ఆమె నటన ఆకట్టుకుంటుంది. జబర్దస్త్ ఫణి, హీరో ఫ్రెండ్ పాత్రలో చేసిన వ్యక్తి బాగానే నవ్వించారు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు.
సాంకేతిక అంశాలు::
సాయి రామ్ ఉదయ్ సినిమాటోగ్రఫీ పనితనాన్ని మెచ్చుకోవాల్సిందే. సినిమా థ్రిల్లింగ్ ఇచ్చేలా ప్రేక్షకుల మూడ్ మొత్తాన్ని క్యారీ చేయడంలో బాగా ఉపయోగపడింది. మ్యూజిక్ డైరెక్టర్ సమర్ద్ గొల్లపూడి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇంటెన్స్ మ్యూజిక్ ఇచ్చాడు. ఎడిటర్ ఫస్టాఫ్లో ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. అది దర్శక నిర్మాతలపై ఆధారపడి ఉంటుంది. ఇక చివరగా డైరెక్టర్ మనోజ్ పల్లేటి బాగా రీసెర్చ్ చేసి రాసుకున్న కథ, తెరకెక్కించిన విధానం బాగుంది. ఒక ఇంటెన్స్ థ్రిల్లర్ సబ్జెక్టుకి సోషల్ మెసేజ్ తో ఊహించని క్లైమాక్స్ తో తెరకెక్కించడంతో డైరెక్టర్ మనోజ్ సక్సెస్ అయ్యాడు.