లింగాల, వెలుగు : చిరుత పులి దాడిలో గొర్రె పొట్టేలు మృతి చెందిన ఘటన లింగాల మండల పరిధిలోని పాత దారారం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగింది. ఫారెస్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పాత దారారం గ్రామానికి చెందిన నిమ్మల మహేశ్ నాలుగు రోజుల క్రితం గొర్రెలు మేపేందుకు గ్రామ సమీపంలోని అడవిలోకి వెళ్లాడు.
గురువారం ఒక గొర్రె పొట్టేలు కనిపించలేదు. తిరిగి అడవిలోకి వెళ్లి పరిశీలించగా పొట్టేలు కళేబరం కనిపించింది. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శివాజీ ఘటన స్థలానికి చేరుకొని దాడి చేసింది చిరుత పులిగా గుర్తించారు. మండలంలోని అప్పాయిపల్లి, శ్రీరంగాపూర్, ఎర్రపెంట, పాత దారారం సమీపంలోని అడవుల్లో చిరుతలు సంచరిస్తున్నాయని అడవుల్లో పశువులను, మేకలను మేపేందుకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని బీట్ ఆఫీసర్ శివాజీ సూచించారు.