శ్రీరాముడి విగ్రహం చెక్కిన అరుణ్‌‌ యోగిరాజ్‌‌

 శ్రీరాముడి విగ్రహం చెక్కిన అరుణ్‌‌ యోగిరాజ్‌‌

అయోధ్యలో ప్రతిష్ఠించనున్న శ్రీరాముడి విగ్రహం ఖరారైంది. కర్నాటకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్‌‌ యోగిరాజ్‌‌ రూపొందించిన ప్రతిమను ప్రాణప్రతిష్ఠ కోసం ఎంపిక చేసినట్లు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌‌ రాయ్‌‌ వెల్లడించారు. ముగ్గురు శిల్పులు మూడు విగ్రహాలను రూపొందించగా.. అరుణ్ చెక్కిన విగ్రహాన్ని కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక చేసిందని తెలిపారు. నల్ల రాయితో మలిచిన ఈ విగ్రహం 150 నుంచి 200 కిలోల బరువు ఉంటుందని చెప్పారు. ఐదేళ్ల వయసున్న బాల రాముడు నిలుచుని ఉన్న రూపంలో విగ్రహం ఉంటుందని వివరించారు. 70 ఏండ్లుగా ఇక్కడే పూజలు అందుకుంటున్న రాముడి విగ్రహాన్ని కూడా  గర్భగుడిలో ఉంచుతామని వెల్లడించారు. 

ప్రజలూ మెచ్చుకోవాలి: అరుణ్‌‌ యోగిరాజ్‌‌

‘‘చిన్నారి విగ్రహంలా ఉండాలి.. కానీ ఇదే సమయంలో దైవత్వం ఉట్టిపడాలి. ఎందుకంటే అది భగవంతుని అవతార విగ్రహం. ఆ విగ్రహాన్ని చూసే వ్యక్తులు దైవత్వాన్ని అనుభవించాలి. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. ఆరేడు ఏడు నెలల కిందట పని ప్రారంభించాను” అంటూ గతంలో అరుణ్ యోగిరాజ్ చెప్పాడు. ఇప్పుడు తాను చాలా సంతోషంగా ఉన్నానని, అయితే ప్రజలు మెచ్చుకుంటే ఇంకా సంతోషంగా ఉంటానని అన్నారు.