దశాబ్ధాల త్యాగం, పోరాటమే రామ్​లల్లా..గ్రాండ్​గా తొలి వార్షికోత్సవం

  • రామ మందిరం ప్రాణప్రతిష్టకు ఏడాది
  • దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
  • గ్రాండ్​గా తొలి వార్షికోత్సవం
  • భారీగా తరలివచ్చిన భక్తులు

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన తొలి వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదట బాల రాముడికి పంచామృతం, సరయూ నది నుంచి తెచ్చిన పవిత్ర జలంతో అభిషేకం చేశారు. ఇవాళ్టి నుంచి జనవరి 13 వరకు కొనసాగునున్న వేడుకలను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఈకార్యక్రమానికి సాధువులు, ఆధ్యాత్మిక నాయకులు, భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. బాల రాముడి కోసం ఢిల్లీకి చెందిన డిజైనర్ల బృందం బంగారం, వెండి నూలు పోగులతో ప్రత్యేక పీతాంబరాలు రూపొందించింది. 
ఈరోజే ఎందుకంటే..?
హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్య మాసంలోని.. శుక్ల పక్ష ద్వాదశి నాడు(22 జనవరి 2024) అయోధ్య బాలరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరిగింది. విష్ణుమూర్తి దశావతారాల్లో రెండోదైన కూర్మావతారాన్ని ధరించిన రోజు కూడా అదే.  కాగా .. ఈ ఏడాది కూర్మ ద్వాదశి జనవరి 11న వచ్చింది. అందువల్లే వార్షికోత్సవాన్ని జరుపుతున్నట్లు ఆలయ ట్రస్ట్‌ వెల్లడించింది.

ప్రజ‌ల‌కు ప్రేర‌ణ‌: మోదీ
అయోధ్య రామ మందిరంలో రామ్‌ల‌ల్లాను ప్రాణప్రతిష్ట చేసి ఏడాది కావొస్తోంది. ఈ నేప‌థ్యంలో తొలి వార్షికోత్సవం సంద‌ర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజ‌ల‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయన ట్విట్టర్​లో పోస్ట్​చేశారు. ‘భార‌తీయ సంస్కృతి, ఆధ్మాత్మిక‌త‌కు గొప్ప వార‌స‌త్వంగా బాలరాముడి ఆల‌యం నిలుస్తుంది. ఎన్నో దశాబ్ధాల త్యాగం, తపస్సు పోరాటాల ద్వారా దీన్ని నిర్మించుకున్నం. నూతన‌ భార‌త్‌ను నిర్మించే అంశంలో ఈ దివ్య, భ‌వ్య అయోధ్య రామాల‌యం ప్రజ‌ల‌కు ప్రేర‌ణ‌గా నిలుస్తుంద‌ని భావిస్తున్న’ అంటూ ఎమోషనల్​గా ట్వీట్​చేశారు.