సొంత పార్టీ లీడర్లే బద్నాం చేస్తున్నరు: రాంరెడ్డి దామోదర్ రెడ్డి

సొంత పార్టీ లీడర్లే బద్నాం చేస్తున్నరు: రాంరెడ్డి దామోదర్ రెడ్డి
  • సూర్యాపేట నుంచే పోటీ చేస్తా
  • టీపీసీసీ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి

సూర్యాపేట, వెలుగు : బీఆర్ఎస్ నాయకులతో కలిసి సొంత పార్టీ నేతలే తాను పార్టీ మారుతున్నానంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడేది లేదని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలపై స్పష్టత ఇవ్వడానికి సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనికట్టుకుని బీఆర్ఎస్ తో పాటు కొంతమంది సొంత పార్టీ నాయకులే బద్నాం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరూ తనను సంప్రదించలేదన్నారు. తనను పార్టీ మారమని అడిగే దమ్ము , ధైర్యం ఎవరికీ లేదన్నారు. తన చివరి శ్వాస వరకు కాంగ్రెస్ లోనే ఉంటానన్నారు.

  కాంగ్రెస్ టికెట్ పై సూర్యాపేట నుంచే పోటీ చేయబోతున్నానని చెప్పారు. గతంలో చంద్రబాబు , టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో కేసీఆర్ పార్టీలోకి రావాలని కోరినా వెళ్లలేదన్నారు. తనకు గ్రూపులు లేవని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. పార్టీ మార్పు కుట్రలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.