స్ట్రాటజీ అండ్ క్యాంపెయిన్ కమిటీ కన్వీనర్ గా రాంరెడ్డి దామోదర్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు:  మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్​కు కాంగ్రెస్ స్ట్రాటజీ అండ్ క్యాంపెయిన్ కమిటీ కన్వీనర్ గా మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. అయితే, గత నెల 2న మాజీ ఎంపీ మధు యాష్కీ కన్వీనర్ గా, మరో ఆరుగురు సభ్యులతో స్ట్రాటజీ అండ్ క్యాంపెయిన్ కమిటీని వేసినట్లు మాణిక్కం ఠాకూర్ ప్రకటనలో తెలిపారు. ఇందులో మధు యాష్కీతో పాటు, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, బలరాం నాయక్, సీతక్క, అంజన్ కుమార్ యాదవ్, సంపత్ కుమార్, అనిల్ కుమార్ పేర్లను ప్రకటించారు. తాజాగా రాంరెడ్డి దామోదర్ రెడ్డిని కన్వీనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. 

తప్పును సరిదిద్దేందుకే: మధు యాష్కీ 

ఏఐసీసీ ప్రచార కమిటీ చైర్మన్ హోదాలో తాను రాష్ట్ర బాధ్యతలు చూస్తానని మాజీ ఎంపీ మధు యాష్కీ అన్నారు. తాను ఒకే అసెంబ్లీ సెగ్మెంట్​కే పరిమితం కానన్నారు. గతంలో తప్పిదం జరిగిందన్నారు. దీనిని గుర్తించి, తప్పును సరిదిద్దడంలో భాగంగానే మును గోడు కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీకి కొత్త కన్వీనర్ ని నియమించి ఉంటారని మధు  యాష్కీ ‘వీ6 వెలుగు’కు క్లారిటీ ఇచ్చారు.