దండకారణ్యంలో 21 ఏండ్ల తర్వాత తెరుచుకున్న రామాలయం

భద్రాచలం, వెలుగు : 21 ఏండ్ల తర్వాత చత్తీస్​గఢ్​ దండకారణ్యంలో పురాతన రామాలయం తెరుచుకుంది. మావోయిస్టు ప్రభావిత బస్తర్​ప్రాంతం సుక్మా జిల్లా చింతల్​నార్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని కేరళపెండ గ్రామంలో పూర్వం నిర్మించిన రామాలయాన్ని 2003లో మావోయిస్టుల హెచ్చరికలతో గ్రామస్తులు మూసివేశారు. ఇటీవల గ్రామ సమీపంలోని లఖపాల్​లో మావోయిస్టుల అణచివేతలో భాగంగా కేంద్రం సీఆర్​పీఎఫ్ ​74వబెటాలియన్​ను ఏర్పాటు చేసింది. దీంతో గ్రామస్తులు సీఆర్పీఎఫ్​ జవాన్లను ఆశ్రయించారు.

 శ్రీరామనవమి వస్తున్నందున ఆలయ తలుపులు తెరవాలని కోరారు. ఆదివారం గ్రామానికి చేరుకున్న బలగాలు గ్రామస్తులతో కలిసి ఆలయ తలుపులు తెరిచి శుభ్రం చేశారు. తర్వాత పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోనే వైద్యశిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఇక్కడి ఆలయ శిఖరంపై హనుమంతుడి చిత్రం ఉంటుంది. ఆలయంలో పాలరాతితో చేసిన సీతారామలక్ష్మణుల విగ్రహాలున్నాయి.  గ్రామస్తుల కోరిక మేరకు రామాలయ పునరుద్ధరణ పనులు త్వరలో ప్రారంభిస్తామని సీఆర్​పీఎఫ్​ జవాన్లు హామీ ఇచ్చారు.