భద్రాచలం, వెలుగు: రాములోరి పట్టాభిషేకం కన్నుల పండువగా జరిగింది. శ్రీరామపునర్వసు దీక్షల విరమణ తర్వాత దీక్షాపరుల కోసం మరుసటి రోజు పట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శుక్రవారం ఉదయం గర్భగుడిలో మూలవరులకు సుప్రభాత సేవ చేసి బాలబోగం నివేదించాక బంగారు కవచాలతో అలంకరించారు. ప్రత్యేక హారతులు ఇచ్చారు.
వైకుంఠరామునడికి పంచాయుధాలు, ఆభరణాలను శాస్త్రోక్తంగా సమర్పించారు. హనుమంతుడికి ముత్యాల దండను బహూకరించారు. భక్తరామదాసు చేయించిన పచ్చల పతకం, చింతాకుపతకం, ముత్యాల హారం భక్తులకు చూపించి అలంకరించారు. చివరగా మంగళవాయిద్యాలు మోగుతుండగా వేదపండితుల వేదమంత్రోచ్ఛరణలతో బంగారు కిరీటధారణ చేసి పట్టాభిషేకం ఘట్టం నిర్వహించారు.
తర్వాత శ్రీరామపట్టాభిషేక మంత్ర సంపుటిత అష్టోత్తర శతనామార్చన జరిపారు. పుష్కర నదీజలాలతో స్వామి వారికి ప్రోక్షణ చేసి భక్తులపై మహాకుంభ తీర్థాన్ని చల్లారు. శ్రీరామదాసు మండపంలో తహసీల్దారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగాయి.