భద్రాద్రి గోదావరిలో రెండు లారీల రామకోటి పుస్తకాల నిమజ్జనం

  • భద్రాద్రి గోదావరిలో వైభవంగా కార్యక్రమం 

భద్రాచలం, వెలుగు : భక్తులు భద్రాద్రి రామయ్యను స్మరించుకుంటూ రాసిన శ్రీరామ కోటి ప్రతులను దేవస్థానం అధికారులు, అర్చకులు, వేదపండితులు బుధవారం సాయంత్రం గోదావరిలో వైభవంగా నిమజ్జనం చేశారు. భక్తులు సమర్పించిన రామకోటి పుస్తకాలు రెండు లారీల్లో తీసుకుని భక్తుల జయజయధ్వానాలు, కోలాటాలు, వేదమంత్రోచ్ఛరణల మధ్య శోభాయాత్రగా రామాలయం నుంచి గోదావరి బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లారు.

ఈవో రమాదేవి కూడా భక్తులతో కలిసి శోభాయాత్రలో పాల్గొన్నారు. శ్రీరామకోటి పుస్తకాలను శిరస్సుపై ధరించి జైశ్రీరామ్​ అంటూ నినాదాలు చేస్తూ భక్తులు కూడా శోభాయాత్రలో నడిచారు. ఈవో గోదావరికి పసుపు, కుంకుమ, శేషమాలికలు, పట్టు వస్త్రాలు, పుష్పాలు, సారెను శాస్త్రోక్తంగా సమర్పించారు.

అంతకు ముందు ఉదయం ప్రాకార మండపంలో సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు పంచామృతాలతో అభిషేకం, సహస్రధారలతో తిరుమంజనం జరిపారు. బేడా మండపంలో జరిగిన నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.