దాన ధర్మాలకు ప్రతీక రంజాన్..

దాన ధర్మాలకు ప్రతీక రంజాన్..

ఉదయం  సైరన్ లతో  సహేరి,  సాయంత్రాలు  ఇఫ్తార్​ విందులతో  వీధులన్నీ పిల్లలు, పెద్దల హడావిడితో  పవిత్ర రంజాన్​ సందడి మొదలైంది.  పాపాలను  తొలగించేలా  పుణ్యపనులు  చేసే పవిత్ర రంజాన్ మాసం మొన్ననే  ప్రారంభమైంది.  మనిషిలోని  చెడును దూరం చేసి ప్రేమ, దయ, జాలి, కరుణ, సానుభూతి వంటి భావాలను పెంపొందింపచేసే  పవిత్ర  రంజాన్ మాసం మానవాళికి మార్గదర్శిగా నిలుస్తోంది.  రంజాన్ మాసం వరాల వసంతం.  మండు వేసవిలో నిండు వసంతం,  ప్రజల మానసిక, ఆధ్యాత్మిక వికాసా

నికీ, జీవన సాఫల్యానికి అవసరమైన  అన్నీ  రంజాన్ మాసంతో ముడిపడి ఉన్నాయి.  మన సంపాదనలో పేదలకు కూడా హక్కు ఉంటుందనే విశిష్టమైన పరమార్థాన్ని చాటి చెబుతోంది రంజాన్.  ఇస్లాం మతానికి కేంద్రమైన  దివ్య ఖురాన్​ అవతరించింది  రంజాన్​ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ మాసాన్ని అత్యంత నియమనిష్టలతో ఉపవాసాలు, దివ్య ఖురాన్​  పఠనం, ఐదు పూటల నమాజ్​,  దానధర్మాలు చేస్తుంటారు.  

తరావీ నమాజులను తప్పనిసరిగా చదువుతారు. ఆనవాయితీగా ఇస్లాం  సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో సంపాదనలో ఖచ్చితంగా ఫిత్ర (దాన ధర్మాలు)  చేయాల్సి ఉంటుంది.   మహమ్మద్​  ప్రవక్త  హజ్రత్ మొహమ్మద్  సల్లల్లాహు అలైహివ సల్లం బోధనలు పవిత్రమైనవి.  ఆయన బోధించిన మార్గంలో నడవడం,  శాంతి, మతసామరస్యం, ఎదుటి వారిపై   ప్రేమాప్యాయతలు చూపడమే ఇస్లాం  ప్రధాన ఉద్దేశం. 

ఆర్థిక సమానత్వానికి ‘జకాత్’ దోహదం

ఈ మాసంలో రోజుకు ఐదు పర్యాయాలు నమాజ్​తో పాటు  ప్రత్యేక  'తరావిహ్' నమాజ్  చేస్తారు.   ఈ నెలలో చనిపోతే నేరుగా స్వర్గానికి చేరుతారని,  నరకపు ద్వారాలు మూసి ఉంటాయని ముస్లింల నమ్మకం.  రంజాన్ మాసంలో ముస్లింలు తెల్లవారు జామున 3 గంటలకే  ' సహేరి'  ఆహారం తీసుకుంటారు. అనంతరం సూర్యాస్తమయం వరకు నీరు, ఆహారం లేకుండా  కఠోర ఉపవాస దీక్ష  చేపడతారు.  వెయ్యిరాత్రుల కన్నా విలువైన  రాత్రి  ‘షబేఖద్ర్​’ కూడా రంజాన్ మాసంలోనే ఉంది.  ఈ ఒక్క రాత్రి ఆరాధన వెయ్యి నెలల  ఆరాధనకన్నా మేలైనది. 

సాధారణ దానధర్మాలతోపాటు 'ఫిత్రా’ అనే  ప్రత్యేక దానం కూడా రంజాన్​లోనే  చెల్లిస్తారు. ఇస్లాం ధర్మశాస్త్రం ప్రకారం ఏడాది పాటు సంపాదనలో,   రెండున్నర శాతం  జకాత్ పేరిట పేదలకు దానం చేయాల్సి ఉంటుంది. డబ్బులు ఉన్నవారే కాకుండా వ్యవసాయ భూముల ద్వారా వచ్చే ఆదాయం, పశువులు, గొర్రెలు, మేకల ద్వారా వచ్చే ఆదాయంపై కూడా తప్పని సరి జకాత్ చెల్లించాలనే నిబంధనలు ఉన్నాయి.  ఇది ఆర్థిక సమానత్వానికి జకాత్  దోహదం 
చేస్తుందని  ఖురాన్ స్పష్టం చేసినట్లు మతపెద్దలు పేర్కొంటున్నారు. 

104వ ఆకాశ గ్రంథంగా పవిత్ర ఖురాన్  

మహమ్మద్ ప్రవక్త కంటే ముందు అనేక మంది. ప్రవక్తలు భూమిపైకి వచ్చారు. మొదటి ప్రవక్త అయిన హజరత్ ఆదం అలైహిస్సాలం కాలంలో 10,  తర్వాత  హజరత్ షీష్ అలైహిస్సాలం కాలంలో 50, హజరత్ ఇద్రీస్ అలైహిస్సాలం కాలంలో 30,  హజరత్ ఇబ్రాహిం అలైహిస్సాలం కాలంలో 10 చొప్పున ఆకాశ గ్రంథాలు భూమిపైన అవతరించాయని మత పెద్దలు చెబుతారు. దాని  తర్వాత హజరత్ మూసా అలైహిస్సలాం,  హజరత్ దావూద్ అలైహిస్సలాం, హజరత్ ఈసా అలైహిస్సలాంల ప్రవక్తల కాలంలో తౌరాత్, జబూర్, ఇంజీల్ గ్రంథాలు అవతరించాయి.  

సృష్టి ఏర్పడినప్పటినుంచి మొత్తం 103 ఆకాశ గ్రంథాలు భూమిపైకి అవతరించాయని చెబుతారు. ఆ తర్వాత చివరి ప్రవక్త అయిన మహమ్మద్ సల్లెల్లాహు అలైహివ సల్లం కాలంలో పవిత్ర ఖురాన్ 104వ గ్రంథంగా అవతరించింది. ఇది చివరిదే కాకుండా అన్ని గ్రంథాల కంటే ఉన్నతమైనదిగా  మౌల్వీలు పేర్కొంటారు. ప్రళయ కాలం సంభవించేవరకు కూడా ఇదే గ్రంథం చెలామణిలో ఉంటుందని, ఈ గ్రంథాన్ని రక్షించే బాధ్యతను స్వయంగా అల్లా చేపట్టారని చెబుతారు.  ఖురాన్ అవతరించి దాదాపు 1500 ఏళ్లు గడిచినా ఈ గ్రంథంలోని చిన్న డాట్ (.) కూడా మారలేదు.

- మొహమ్మద్ షౌకత్ అలీ