
భద్రాచలం, వెలుగు : భూపాలపల్లి జిల్లా చెల్పూర్ గ్రామానికి చెందిన రామదాసు భక్త మండలి సభ్యులు ఆదివారం సీతారాముల కల్యాణానికి కోటి గోటి తలంబ్రాలను సమర్పించారు. వీరు ఎనిమిదేండ్లుగా కల్యాణ తలంబ్రాల కోసం స్వయంగా వరి పంటను పండించి, పూజలు చేసి, గోటితో తలంబ్రాలను వలిచి భద్రాచలం రామాలయానికి అందజేస్తున్నారు. ఈ సందర్భంగా తలంబ్రాలను శిరస్సుపై ధరించి శోభాయాత్రగా ఆలయానికి వచ్చి పూజలు చేసి అధికారులకు అందజేశారు.
అంతకు ముందు ఉదయం గర్భగుడిలో పంచామృతాలతో అభిషేకం చేశారు. బంగారు పుష్పాలతో స్వామికి అర్చన చేసి ప్రత్యేక హారతులు ఇచ్చారు. బేడా మండపంలో జరిగిన నిత్య కల్యాణంలో భక్తులు కంకణాలు ధరించి క్రతువును నిర్వహించారు. సాయంత్రం స్వామికి దర్బారు సేవ జరిగింది.