కాగజ్ నగర్, వెలుగు : మూడుసార్లు ఓట్లేసి ఆశీర్వదించిన సిర్పూర్ నియోజకవర్గం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పనిచేశారని, ఆదరించిన ప్రజలకు రుణపడి ఉంటామని ఆయన సతీమణి రమాదేవి అన్నారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాగజ్ నగర్ పట్టణంలోని ద్వారకా నగర్, సర్దార్ బస్తీ, స్టేషన్ ఏరియాలో మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, కౌన్సిలర్ లతితో కలిసి రమాదేవి ముమ్మర ప్రచారం నిర్వహించారు.
గడపగడపకూ తిరుగుతూ ఎమ్మెల్యే చేసిన పనులు, జరిగిన అభివృద్ధిని వివరించారు. బీఆర్ఎస్ సర్కారులో పేద వర్గాలకు పూర్తిగా న్యాయం జరిగిందని, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయన్నారు. మారుమూల గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించేందుకు నిబద్ధతతో పనిచేసినట్లు చెప్పారు. నియోజకవర్గంలోని కాలేజీల్లో సొంతంగా మధ్యాహ్న భోజనం పెట్టించి విద్యార్థుల ఆకలి బాధలు తీర్చామన్నారు. గ్రామాలకు రోడ్లు, బ్రిడ్జిలు కట్టించి ప్రజల కష్టాలు తీర్చామని తెలిపారు.
రానున్న రోజుల్లోనూ ప్రజలకు అండగా ఉంటామన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో కోనప్పను గెలిపించి మరోసారి సేవ చేసే అవకాశం ఇవ్వాలని రమాదేవి వేడుకున్నారు.