
- పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ లేఖతో రీ సర్వేకు కేంద్రమంత్రి ఆదేశాలు
- బసంత్ నగర్, అంతర్గాం ప్రాంతాల్లో భూములను పరిశీలించిన ఏఏఐ బృందం
- ఎయిర్ పోర్టుకు సమీపంలోనే రోడ్డు, రైలు కనెక్టివిటి సౌకర్యాలు
- అందుబాటులోకి వస్తే సమీప పట్టణాలకు ప్రజలకు ఈజీ జర్నీ
గోదావరిఖని, వెలుగు : రామగుండం ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై ఆశలు చిగురించాయి. ఇప్పటికే దీనిపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడును కలిసి వినతిపత్రం అందించారు. దీంతో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ఇండియా (ఏఏఐ) డీజీఎం మల్లిక ఆధ్వర్యంలోని అధికారుల బృందం రామగుండం సెగ్మెంట్ లోని బసంత్ నగర్, అంతర్గాం ప్రాంతాల్లోని భూములను రీ సర్వే చేసింది.
1972లోనే ఎయిర్‌లైన్స్ సర్వీసులు..
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం (పూర్వ రామగుండం) పరిధిలోని బసంత్‌నగర్‌లో కేశోరామ్ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటైంది. కాగా సంస్థ అధినేత బీకే బిర్లా తన ప్లాంట్‌ను సందర్శించేందుకు1972లోనే 294 ఎకరాల్లో ఎయిర్ పోర్టును నిర్మించారు. హైదరాబాద్‌నుంచి ఇక్కడికి ‘వాయుదూత్ఎయిర్ లైన్స్’ పేరుతో 21 సీట్ల చిన్న విమానాలు రాకపోకలు సాగించేవి. ఆ తర్వాత కొంత కాలానికి సర్వీస్‌లను నిలిపివేశారు. 2017 లో కేంద్ర ప్రభుత్వం ‘ ఉడో దేశ్‌కీ హమ్ నాగరిక్ (ఉడాన్) స్కీమ్ తెచ్చాక బసంత్నగర్ఎయిర్పోర్టును విస్తరిం చాలనే ప్రతిపాదన వచ్చింది. అందుకు 2020 సంవత్సరం నుంచి ఇక్కడ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి టెక్నికల్, భౌగోళిక సర్వేలను ఎయిర్పోర్ట్అథారిటీ ఆఫ్ఇండియా (ఏఏఐ) చేపడుతోంది.
ఆ రెండు ప్రాంతాల్లో భూముల గుర్తింపు
పాలకుర్తి మండలంలోని బసంత్‌నగర్‌లో ఎయిర్‌పోర్టు వద్ద ఇప్పటికే 300 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. ఇక్కడ రన్‌వే ఉండగా, మరో 60 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. ఇదికాకుండా అంతర్గాం మండల కేంద్రం నుంచి రాయదండి గ్రామానికి వెళ్లే మధ్యలో సుమారు 500 ఎకరాలు అందుబాటులో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్(జీఎఫ్ఏ) కింద క్లియరెన్స్ఇచ్చిన తర్వాత ఎక్కడ అనువుగా ఉంటుందనే విషయాలపై ఏఏఐ ఆఫీసర్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
హైటెన్షన్ వైర్లు, గుట్టలను తొలగిస్తే..
బసంత్నగర్రన్వే ఏరియాలోని విద్యుత్ హైటెన్షన్ వైర్లతో పాటు కన్నాల గ్రామ పరిధిలోని బోడగుట్ట గుట్టలు అడ్డంకిగా మారుతాయనే అభిప్రాయానికి ఏఏఐ ఆఫీసర్లు వచ్చినట్టు తెలిసింది. హైటెన్షన్వైర్లను మరో మార్గం ద్వారా పంపించడంతో పాటు గుట్టలను తొలగిస్తే ఇక్కడే ఎయిర్‌పోర్టు ఏర్పాటు బెటర్ అనేది రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏఏఐ బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఎయిర్‌పోర్టు స్థలానికి రోడ్డు, రైలు కనెక్టివిటీ అతి సమీపంలో ఉండగా ఈజీగా ప్యాసింజర్లు ఎయిర్ పోర్టుకు చేరుకునే అవకాశం ఉంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఒకవేళ బసంత్‌నగర్‌లో ఎయిర్‌పోర్టు సాధ్యం కాకుండా అంతర్గాం -– రాయదండి గ్రామాల మధ్యలోని స్థలంలోనూ నిర్మించే చాన్స్ ఉంటుంది.
రామగుండంలో ఎయిర్‌పోర్టు ఎంతో అవసరం
రామగుండం ప్రాంతంలో ఎయిర్‌పోర్టు అవ సరం ఎంతో ఉంది. ఇక్కడ సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, జైపూర్ఎస్టీపీపీ, బసంత్నగర్సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆయా పరిశ్రమల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు చాలా మంది పని చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి విదేశాలకు కూడా ఎక్కువ మంది జాబ్ లు, స్టడీస్ కోసం వెళ్తుంటారు. పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్ వంటి పట్టణాల నుంచి విమాన సర్వీసుల కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్‌కు వెళ్తుంటారు. రామగుండంలో ఎయిర్‌పోర్టు ఉంటే ఆయా ప్రాంతాలవారికి సమయం ఆదాతో పాటుప్రయాణం ఈజీ అవుతుంది. రోడ్డు, రైలు కనెక్టివిటీ ఉండడంతో సమీప రాష్ట్రాలకు వెళ్లే వారికి కూడా ఎయిర్ పోర్టు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. రామగుండంలో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడుకు లేఖ అందజేసి వివరించాను. స్పందించిన కేంద్ర మంత్రి ఆదేశాలతో బసంత్‌నగర్, అంతర్గాంలో భూముల రీ సర్వే చేపట్టింది. త్వరగా ఎయిర్‌పోర్టుకు అనుమతి ఇచ్చే లా మరోమారు కేంద్ర మంత్రిని కలిసి కోరు తాను.
- గడ్డం వంశీకృష్ణ, పెద్దపల్లి ఎంపీ