- 37 శాతమే వసూలైన ప్రాపర్టీ ట్యాక్స్
- జీతాలు చెల్లించలేని స్థితిలో కార్పొరేషన్
గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్‌లో ట్యాక్స్ సరిగా వసూలు కావడం లేదు. మొత్తం 50 డివిజన్ల పరిధిలో 61 వేల ఇండ్లు ఉండగా.. వాటి నుంచి ఏటా రూ.14.75 కోట్లు ట్యాక్స్ వసూలు కావాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 నెలల కాలం ముగిసినప్పటికీ ఇందులో కేవలం 37 శాతం మాత్రమే ట్యాక్స్ వసూలైంది.
కార్పొరేషన్‌లో పనిచేస్తున్న శానిటేషన్ లేబర్, ఔట్ సోర్సింగ్ఉద్యోగులకు ప్రతి నెలా 1 నుంచి 5వ తేదీ లోపు జీతాలు చెల్లించాల్సి ఉండగా, జనరల్ ఫండ్‌లో డబ్బులు లేక జీతాల చెల్లింపు ఆలస్యమవుతోంది.
పన్ను వసూళ్లపైనే జీతాల భారం
రామగుండం కార్పొరేషన్‌లో 431 మంది శానిటేషన్ లేబర్, 121 మంది ఔట్సోర్సింగ్ఉద్యోగులు వివిధ డిపార్ట్ మెంట్లలో పని చేస్తున్నారు. వీరికి ప్రతి నెలా జీతాల రూపంలో రూ.1.05 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని జనరల్ ఫండ్ నుంచే తీసుకోవాలి. అయితే ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు సరిగా కాకపోవడంతో జీతాల చెల్లింపు ఆలస్యమవుతోంది. తాజాగా ఈ నెలకు సంబంధించి ఐదో తేదీ లోపు జీతం ఇవ్వాల్సి ఉండగా 16వ తేది వరకు ఔట్ సోర్సింగ్ సిబ్బందికి చెల్లించలేదు. శానిటేషన్ సిబ్బందికి 14న చెల్లించారు. పన్ను వసూలు సరిగ్గా కాకపోతే రాబోయే రోజుల్లో మరింత ఇబ్బంది ఏర్పడే పరిస్థితి నెలకొననుంది.
ముందుకు సాగని లక్ష్యం...
రామగుండం కార్పొరేషన్‌లో ఏటా వందశాతం పన్ను వసూళ్లు చేస్తామనే లక్ష్యాన్ని పెట్టుకున్నా అది ముందుకు సాగడం లేదు. ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.14.75 కోట్ల ట్యాక్స్ వసూలు చేయాల్సి ఉండగా రూ. 5. 45 కోట్లతో కేవలం 37 శాతం మాత్రమే వసూలు చేశారు. ఇంకా రూ. 9.30 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా నెలన్నర రోజులు మిగిలి ఉండగా ఈ లక్ష్యాన్ని సాధించడం కష్టమే. ఐదేళ్ల క్రితం 90 శాతం పన్ను వసూలు చేయగా, గత ఆర్థిక సంవత్సరం 63 శాతం పన్ను వసూలైంది.
మొండి బకాయిలపై దృష్టి సారించాలి...
రామగుండం కార్పొరేషన్‌లో మొండి బకాయిలు రూ.కోట్లలో ఉన్నాయి. వీటిపై ప్రత్యేక దృష్టి సారిస్తే అవి కొంతవరకైనా వసూలయ్యే అవకాశం ఉంది. కార్పొరేషన్ పరిధిలో కొన్నేళ్లుగా పలు నిర్మాణాలకు ట్యాక్స్ వేసినా వాటిని చెల్లించకపోవడంతో బకాయిలు పెద్ద మొత్తంలో పేరుకుపోయాయి. బల్దియా పరిధిలో 12 కమర్షియల్ అసెస్మెంట్స్ నుంచి రూ.1.87 కోట్లు బకాయిల రూపంలో రావాల్సి ఉంది.
ఇందులో సినిమాహాల్, రైస్ మిల్లులు, హోటల్, జూనియర్ కాలేజీ, పెట్రోల్ బంక్ ఉన్నాయి. ఇవన్నీ కలిపి మొత్తం రూ.5.11 కోట్ల మొండి బకాయిలు రావాల్సి ఉండగా, ఈ నిర్మాణాల ఓనర్లకు లీగల్ నోటీస్‌లు ఇచ్చి యంత్రాంగం చేతులు దులుపుకుంటోంది. మొండి బకాయిల వసూళ్లతో పాటు కొత్త నిర్మాణాల నుంచి వచ్చే ట్యాక్స్‌ను సక్రమంగా వసూలు చేస్తే రామగుండం బల్దియా జనరల్ ఫండ్‌కు ఢోకా ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ట్యాక్స్ వసూలుపై ప్రత్యేక దృష్టి
రామగుండం కార్పొరేషన్‌లో పనిచేసే కార్మికులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాభత్యాలన్నీ జనరల్ ఫండ్‌పైనే ఆధారపడి ఉన్నాయి. అందువల్ల ట్యాక్స్ వసూలుపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నాం. ప్రజలు పన్నులు చెల్లించి కార్పొరేషన్‌కు సహకరించాలి. మొండి బకాయిలను వసూలు చేసేలా చర్యలు తీసుకుంటాం.
- సీహెచ్ శ్రీకాంత్,
కమిషనర్, రామగుండం కార్పొరేషన్