- రామగుండం కార్పొరేషన్‌లో చెత్త వేసేందుకు స్థలం కరువు
- చెత్త కాల్చడంతో పెరుగుతున్న కాలుష్యం
- సీరియస్‌గా తీసుకోని పాలకవర్గం
గోదావరిఖని, వెలుగు రామగుండం కార్పొరేషన్‌లో చెత్త డంపింగ్‌కు స్థలం కరువైంది. గోదావరి నది ఒడ్డున ఖాళీ ప్రదేశమే డంపింగ్‌యార్డ్ అవుతోంది. బల్దియా చెత్తను తాత్కాలికంగా నది ఒడ్డున డంప్ చేస్తుండడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. మరోవైపు డంప్ చేసిన చెత్తను కాలుస్తుండడంతో కాలుష్యం పెరుగుతోంది. పొగతో బల్దియా వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే పారిశ్రామిక, డ్రైనేజీ వాటర్‌తో గోదావరి కలుషితం అవుతుండగా సిటీ చెత్త గోదావరిని ముంచెత్తుతోంది. పర్మినెంట్‌గా చెత్త డంపింగ్ కోసం పాలకవర్గం సీరియస్‌గా ప్రయత్నాలు చేయడం లేదు.
రోజుకు 115 మెట్రిక్ టన్నుల చెత్త
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో సింగరేణి, ఎన్టీపీసీ కాలనీలు మినహా మిగతా ప్రాంతాల్లో రోజుకు 115 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తారు. ఈ చెత్తను గతంలో సింగరేణి సంస్థకు చెందిన జీడీకే 11వ గని సమీపంలోని జల్లారం, సింగిరెడ్డిపల్లె గ్రామాల సమీపంలోని ఖాళీ స్థలంలో పారబోసేవారు. అయితే సింగరేణి అభ్యంతరం చెప్పడంతో బల్దియాకు చెత్త డంపింగ్ సమస్యగా మారింది. దీంతో చేసేదేమీలేక తాత్కాలికంగా గోదావరిఖనిలోని గోదావరి ఒడ్డున సమ్మక్క జాతర జరిగే ఖాళీ ప్రదేశంలో డంప్‌చేస్తున్నారు. రామగుండం, ఎన్టీపీసీ, గోదావరిఖని, యైటింక్లయిన్ కాలనీల నుంచి ఆటో ట్రాలీల ద్వారా చెత్త తరలించి ఇక్కడ డంప్‌చేస్తున్నారు.
పొగతో ఉక్కిరిబిక్కిరి
కార్పొరేషన్‌కు డంపింగ్ స్థలం లేకపోవడంతో నది ఒడ్డున వేస్తున్న చెత్త నిత్యం కాలుతూనే ఉంది. చెత్త వేసిన చోటే కాల్చి మళ్లీ అక్కడే డంప్చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రోజూ చెత్త కాలుతుండడంతో ఆ ప్రాంతమంతా పొగ కమ్ముకుంటోంది. ఈ పొగతో సమీపంలోని గంగానగర్, జనగామ, ఉదయ్ నగర్, పవర్‌హౌస్ కాలనీ, రెడ్డి కాలనీలోని నివాసాలతోపాటు సింగరేణి మిలీనీయమ్ క్వార్టర్లలో నివసిస్తున్న ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దుర్వాసన, అపరిశుభ్రతతో గోదావరి ఒడ్డుకు వచ్చేవారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇక పారబోస్తున్న, కాలుస్తున్న చెత్త వర్షాకాలంలో నదిలోకి చేరే అవకాశం ఉంది. ఇప్పటికే నిల్వ నీటిలో వ్యర్థాలు కలుస్తుండగా, వర్షాకాలంలో నదిలో చెత్త నిండితే మరింత జల కాలుష్యం పెరిగిపోయి ప్రజలు రోగాలబారిన పడే ప్రమాదం పొంచి ఉంది.
పట్టింపులేని పాలకవర్గం...
రామగుండం కార్పొరేషన్ పరిధిలో వెలువడుతున్న చెత్తను డంప్చేసేందుకు పర్మినెంట్స్థలం లేదు. దీనిపై పాలకవర్గం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. సింగరేణికి చెందిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్‌లో బొగ్గు నిల్వలు నిండుకోగా అక్కడ ఏర్పడిన కందకాలలో చెత్త నింపొచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ దిశగా కార్పొరేషన్ నుంచి సీరియస్‌గా ప్రయత్నాలు జరగడం లేదు. పర్మినెంట్ స్థలం కోసం పాలకవర్గం సింగరేణితో చర్చించి సమస్యను త్వరగా పరిష్కరించాలని బల్దియావాసులు డిమాండ్ చేస్తున్నారు.