
- వివిధ అంశాలపై బల్దియాలో ఢిల్లీ టీమ్ సర్వే
- గతేడాది 175వ ర్యాంకు..
గోదావరిఖని, వెలుగు: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు రామగుండం కార్పొరేషన్ అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా శానిటేషన్, కమ్యూనిటీ, పబ్లిక్ టాయిలెట్లు నిర్వహణపై ఢిల్లీకి చెందిన క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చెందిన ప్రతినిధి బృందం సర్వే చేపట్టింది. ఈ విభాగాల్లో కార్పొరేషన్ పనితీరును మదింపు చేస్తున్నారు. 2023లో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రామగుండం కార్పొరేషన్‌కు 175వ ర్యాంక్ రాగా, ఈసారి ర్యాంక్ మెరుగవుతుందనే ఆశాభావంతో రామగుండం కార్పొరేషన్ యంత్రాంగం ఆశాభావంతో ఉంది.
శానిటేషన్ మెరుగుపర్చేందుకు..
దేశంలోని పట్టణాలు, నగరాలలో పారిశుధ్యాన్ని మెరుగుపర్చేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ, స్వచ్ఛ భారత్మిషన్ ఆధ్వర్యంలో ప్రతి యేటా పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ 2024లో పోటీ చేసేందుకు రామగుండం కార్పొరేషన్ కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది. కేంద్రం అంగీకరించడంతో మార్చి 5వరకు క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
క్షేత్రస్థాయిలో జరుగుతున్న తీరును పరిశీలించేందుకు ఢిల్లీ నుంచి క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు రామగుండం చేరుకున్నారు. కార్పొరేషన్ పరిధిలో ర్యాండమ్‌గా గుర్తించిన ప్రాంతాలకు వెళ్లి ఇండ్ల యజమానులను కలిసి చెత్త సేకరణపై సర్వే చేస్తున్నారు. అలాగే పబ్లిక్, కమ్యూనిటీ టాయిలెట్లను పరిశీలించి సెప్టిక్ ట్యాంక్‌ల నిర్వహణ, కేర్‌టేకింగ్, క్లీనింగ్, ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్, టాయిలెట్లకు తలుపులు, వాష్ బేసిన్, వాటర్సప్లై, తదితర అంశాలను పరిశీలిస్తున్నారు.
మెరుగైన ర్యాంక్ కోసం..
రామగుండం కార్పొరేషన్ ఏరియా 50 డివిజన్లతో 93.87 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి, 2,29,644 జనాభా కలిగి ఉంది. 2017 నుంచి ఇప్పటివరకు మెరుగైన ర్యాంక్ సాధించాలనే తపనతో యంత్రాంగం పనిచేస్తోంది. 2017లో 191వ ర్యాంక్, 2018లో 194వ ర్యాంక్, 2019లో 192వ ర్యాంక్, 2020లో 211వ ర్యాంక్, 2021లో 92వ ర్యాంక్, 2022లో 136వ ర్యాంక్, 2023లో 175వ ర్యాంక్ సాధించింది. ప్రస్తుతం కార్పొరేషన్ పరిధిలో ప్రతి డివిజన్లో ఉదయం చెత్త సేకరించేందుకు 90 వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంటింటికి సేకరించిన చెత్తలో రీయూజ్ చేసే చెత్తను సిబ్బంది వెంటనే వేరు చేస్తూ గౌతమీనగర్‌లోని డీఆర్‌సీ సెంటర్‌కు పంపిస్తున్నారు.
మానవ వ్యర్థాలను ఎరువుగా మార్చే మల్కాపూర్‌లోని ఫీకల్స్లడ్జ్ట్రీట్మెంట్ప్లాంట్(ఎఫ్ఎస్టీపీ)ని వినియోగంలోకి తీసుకువచ్చారు. రామగుండం పట్టణంలో సీవరేజ్ ట్రీట్‌మెంట్‌ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. రోడ్లమీద చెత్త వేయకుండా ఆయా ఏరియాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. ఎవరైనా చెత్తను రోడ్లపై వేస్తే వారికి జరిమానా విధిస్తున్నారు. ఈ క్రమంలో స్వచ్ఛ సర్వేక్షన్లో మెరుగైన ర్యాంక్ సాధిస్తామనే ఆశాభావంతో కార్పొరేషన్ ఆఫీసర్లు ఉన్నారు.