గోదావరిఖని, వెలుగు: ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించాలని, ఆయా గ్రామాల ప్రజల సమస్యలు, ఫిర్యాదులు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ సూచించారు. గురువారం రామగుండం సర్కిల్ ఆఫీస్, పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, పోలీస్ ఆఫీసర్లు, సిబ్బందికి సూచనలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్ ఉండాలని ఆదేశించారు.
సమస్యతో పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులకు సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకాన్ని కలిగించాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాల సరఫరా, విక్రయం, అక్రమ రవాణా, లాంటి వాటిపై, నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. సీపీ వెంట పెద్దపల్లి డీసీపీ చేతన, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేశ్, రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ సంధ్యారాణి, ఎన్టీపీసీ ఎస్ఐ ఉదయ్ కిరణ్, అంతర్గాం ఎస్ఐ వెంకట్ ఉన్నారు.