వచ్చే నెల 2 నుంచి ట్రయల్ రన్.. 99% పనులు పూర్తయినయ్
ఏటా 12.5 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి: కేంద్ర మంత్రి మన్షుక్ మాండవీయ
ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానిస్తం: కిషన్‌రెడ్డి
ఫ్యాక్టరీని పరిశీలించిన కేంద్ర మంత్రులు
అంతకుముందు ఫ్యాక్టరీ గేటు వద్ద టీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే ఆందోళన
కేంద్ర మంత్రులను అడ్డుకునేందుకు ప్రయత్నం
రివ్యూ మీటింగ్‌కు వెళ్లకుండానే వెనుదిరగాలని కేంద్ర మంత్రుల నిర్ణయం
గోదావరిఖని, వెలుగు: రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ ఎఫ్ సీఎల్) ఫ్యాక్టరీలో వచ్చే నవంబర్ నుంచే ఎరువుల ఉత్పత్తి ప్రారంభమవుతుందని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి మన్షుక్ మాండవీయ ప్రకటించారు. ఫ్యాక్టరీలో 99 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయని, కరోనా వల్ల మూడు నెలలు ఆలస్యమైం దన్నారు. 1999లో మూసేసిన ఈ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలని, ఎన్టీపీసీలో అదనపు పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనే తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్ష మేరకు ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత మరో ఏడెనిమిది వందల మందికి అదనంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని, వాటిని స్థానికులకు అందించేలా కృషి చేస్తామన్నారు. శనివారం ఆయన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డితో కలిసి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని సందర్శించారు. ఆఫీసర్లతో సమీక్షించిన తర్వాత ప్లాంట్ లోని వివిధ లొకేషన్లను పరిశీలించి మాట్లాడారు. దేశంలో ఏటా 350 లక్షల టన్నుల వరకు యూరియా అవసరమని.. ప్రస్తుతం 250 లక్షల టన్నుల మేరకే ఉత్పత్తి అవుతోందని మాండవీయ చెప్పారు. ఈ కొరత వల్ల విదేశాల నుంచి 70 లక్షల టన్నుల దాకా దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. ఇలా విదేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా ఉండేందుకు దేశంలో
రామగుండం, తాల్చేర్ , సింద్రీ లాంటి ఐదు చోట్ల ఎరువుల ఫ్యాక్టరీలను నెలకొల్పా మని వివరించారు. రూ. 6,120.50 కోట్లతో చేపట్టిన రామగుండం ఫ్యాక్టరీలో రోజుకు 2,200 టన్నుల అమ్మోనియా, 3,850 టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుందన్నారు. ఏటా 12.5 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి చేస్తామని, అందులో సగం తెలంగాణకు కేటాయిస్తామని తెలిపారు. అక్టోబర్ 2 నుంచి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఆఫీసర్లు సిద్ధంగా ఉన్నారని మాండవీయ చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా నాణ్యమైన ఎరువులను సకాలంలో అందించడానికి ప్రధాని మోడీ చర్యలు తీసుకుంటున్నారన్నారు.
ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానిస్తం: కిషన్ రెడ్డి
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నవంబర్‌లో ప్రారంభిస్తామని, దీనికి ప్రధాని మోడీని ఆహ్వానిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి చెప్పారు. ఇన్నాళ్లూ మూతపడిన ఈ ఫ్యాక్టరీని కేంద్రం పునరుద్ధరిస్తోందని, అలాగే రామగుండం ఎన్టీపీసీలో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్నదని వివరించారు. త్వరలోనే ఈ ప్లాంట్ సమీక్ష కోసం మళ్లీ వస్తామన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో టెక్నికల్‌గా పురోగతి ఉందని, వాతావరణ కాలుష్యం లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఫ్యాక్టరీలో స్థా నికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ఆఫీసర్లకు సూచించామన్నారు. ఉద్యోగాల్లో నాన్ లోకల్స్ ఎవరైనా నియమితులైతే ఆధారాలు చూపించాలని, ఆఫీసర్లపై విచారణ జరిపిస్తామని, నిజమని తేలితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెరిచే ప్రయత్నం చేయడం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. మూతపడిన ఆల్విన్ ఫ్యాక్టరీని అలాగే వదిలేశారని, ఎన్నికల మేనిఫెస్టోలో తెరిపిస్తామని పొందుపర్చిన నిజాం షుగర్ ఫ్యాక్టరీకి అతీగతీ లేదన్నారు.
For More News..