- రాష్ట్రంలో మార్క్‌ఫెడ్ గోడౌన్లకే పరిమితమైన 90 వేల టన్నులు
- టన్ను యూరియా అమ్మితే కేంద్రం నుంచి రూ. 40 వేల సబ్సిడీ
- అమ్మకాలు లేకపోవడంతో సబ్సిడీ విడుదల చేయని కేంద్రం
- ‘ఉద్దెర’ ఇస్తుండడంతో ప్రైవేట్ ఎరువుల వైపు రైతుల మొగ్గు
- ప్లాంట్ నిర్వహణకు ‘ఆర్థిక’ కష్టాలు
గోదావరిఖని, వెలుగు : రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్) కంపెనీని ‘స్టాక్’ కష్టాలు చుట్టుముట్టాయి. గడిచిన ఎనిమిది నెలలుగా ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి ఉత్పత్తి అయిన వేలాది టన్నుల యూరియా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని మార్క్‌ఫెడ్ గోడౌన్స్‌లో నిల్వ ఉంది. టన్ను యూరియా అమ్మితే కేంద్రం నుంచి ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు రూ. 40 వేల సబ్సిడీ వస్తుంది. కానీ ప్రస్తుతం యూరియా అమ్ముడుపోకుండా గోడౌన్స్‌లోనే నిల్వ ఉండడంతో కేంద్రం నుంచి రావాల్సిన సబ్సిడీ నిలిచిపోయింది. దీంతో ప్లాంట్ నిర్వహణ భారంగా మారింది.
ఉత్పత్తిలో 40 శాతానికి పైగా తెలంగాణకే...
రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ప్లాంట్‌లో ప్రతి ఏటా 12.75 లక్షల టన్నుల యూరియాను ఉత్పత్తి చేస్తున్నారు. ఇందులో 40 శాతానికి పైగా తెలంగాణ రాష్ట్ర అవసరాలకే కేటాయిస్తున్నారు. ఈ మొత్తం యూరియాను రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే మార్క్‌ఫెడ్ సంస్థకు అందిస్తుండగా, అక్కడి నుంచి జిల్లాలకు కేటాయింపులు చేస్తుంటారు.
గోడౌన్లలోనే 90 వేల టన్నులు
ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్లాంట్‌లో ఉత్పత్తి అయిన సుమారు 90 వేల టన్నుల యూరియా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న గోడౌన్లలో పేరుకుపోయింది. ఇందులో ఆరు వేల టన్నుల యూరియా ఆరు నెలల కంటే ముందే ఉత్పత్తి కాగా, మరో ఏడు వేల టన్నులు నాలుగు నెలల కంటే ముందు ఉత్పత్తి అయింది. కాగా ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల పరిధిలో యూరియా స్టాక్ మరింత ఎక్కువగా ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. వాస్తవంగా రబీ సీజన్ కోసం అక్టోబర్, నవంబర్ నెలల్లో, ఖరీఫ్ కోసం ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే యూరియాను నిల్వ చేయాలి. కానీ ప్రస్తుతం గోడౌన్లలో ఉన్న యూరియా ఆరు నెలల ముందు ఉత్పత్తి అయింది కావడంతో అది పనికిరాకుండా పోయే ప్రమాదం ఉందని ఆఫీసర్లు అభిప్రాయపడుతున్నారు.
అమ్మకాలు లేక నిలిచిన సబ్సిడీ
ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో టన్ను యూరియా తయారు చేసేందుకు రూ.45,300 ఖర్చు అవుతుంది. అయితే రైతుకు రూ. 5,300కే అమ్ముతుండగా, మిగిలిన రూ. 40 వేలను కేంద్రం సబ్సిడీ రూపంలో ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు చెల్లిస్తుంది. ఎంత ఎక్కువ యూరియా అమ్మితే అంత ఎక్కువ సబ్సిడీ కంపెనీ ఖాతాలో పడుతుంది. కానీ ప్రస్తుతం ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు చెందిన యూరియా అమ్మకాలు జరగకపోవడంతో స్టాక్ మొత్తం గోడౌన్లలోనే నిలిచిపోయింది. దీంతో కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీ కూడా ఆగిపోయింది. దీనికి తోడు యూరియా ఎక్కువ కాలం స్టాక్ ఉంటే గడ్డ కట్టి పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంటుంది. ఇదే జరిగితే ఆ యూరియా మార్కెట్‌లో సేల్ అవ్వక, కేంద్ర సబ్సిడీ పూర్తిగా రాకుండా పోతుంది.
ప్రైవేట్ ఎరువుల వైపు రైతుల మొగ్గు
ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉత్పత్తి అయిన యూరియా నేరుగా మార్క్‌ఫెడ్ గోడౌన్లకు చేరుతుంది. అక్కడి నుంచి గవర్నమెంట్ సొసైటీల ద్వారా క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో రైతులకు అమ్ముతుంటారు. అదే ప్రైవేట్ ఎరువుల దుకాణంలో అయితే రైతులకు ఉద్దెరకే యూరియా, విత్తనాలు సప్లై చేస్తుంటారు. దీంతో రైతులు ప్రైవేట్ దుకాణాల వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంతో మార్క్‌ఫెడ్ గోడౌన్లలోని యూరియా అమ్మడుపోక నిల్వలు పేరుకుపోతున్నాయి. ఈ యూరియా కొనేలా రైతులకు అవగాహన కల్పించడంలో ఆఫీసర్లు విఫలం అవుతున్నారు.
కష్టంగా ప్లాంట్ నిర్వహణ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ, ప్రైవేటు భాగస్వామ్య సంస్థల పెట్టుబడితో నడుస్తున్న ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్లాంట్ నిర్వహణకు సుమారుగా రూ.800 కోట్ల లోన్ తీసుకున్నారు. దీనికి ప్రతి నెల తొమ్మిది శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. దీనికి తోడు ప్లాంట్ కోసం వినియోగిస్తున్న గ్యాస్ కోసం ప్రతి 15 రోజులకు ఒక సారి రూ.180 కోట్లు చెల్లించాలి. కేంద్రం నుంచి సబ్సిడీ వస్తే సంస్థపై ఆర్థికభారం తగ్గుతుంది. కాకినాడలోని నాగార్జున ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌లో కూడా యూరియా నిల్వ పెరిగిపోవడం, కేంద్ర సబ్సిడీ రాకపోవడంతో అది మూతపడింది. ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు కూడా ఇలాంటి పరిస్థితి రాకముందే యూరియా అమ్మకాలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం, మార్క్‌ఫెడ్, అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.