గోదావరిఖని, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారమే పాలన అందిస్తున్నామని, ఇప్పటికే ఆరు గ్యారంటీలలో ఐదింటిని అమలుచేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్రాజ్ఠాకూర్ పేర్కొన్నారు. బుధవారం రామగుండం టౌన్‌లో సబ్ రిజిస్టార్ ఆఫీస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలుచేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని చెప్పారు.
మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో ఈ ప్రాంతాన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రజల చిరకాల కోరిక సబ్ రిజిస్టర్ ఆఫీస్‌ను రామగుండంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీకి చెందిన నూతన వివాహ జంటకు మొదటి రిజిస్ట్రేషన్ పత్రాలను సబ్ రిజిస్ట్రార్ బానోత్ తిరుపతితో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో మేయర్ అనిల్ కుమార్, అడిషనల్ కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ లాల్, కాంగ్రెస్ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.