
గోదావరిఖని, వెలుగు : భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం శనివారం గోదావరిఖని పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో యాత్ర చేపట్టారు. జైబాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ యాత్రలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో మెయిన్ చౌరస్తాలోని గాంధీ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజ్యాంగ పరిరక్షణ అన్నది కేవలం ఒక నినాదం కాదని, ఇది ప్రతి భారత పౌరుడి బాధ్యతని అన్నారు. అయితే ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం 'విభజించి పాలించు' తత్వంతో ముందుకు సాగుతూ దేశాన్ని ముక్కలు చేస్తోందని విమర్శించారు.
సామాన్యుల హక్కులను కాలరాస్తూ, కార్పొరేట్ ధనవంతులకే మద్దతు ఇస్తోందని, మత విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చే చర్యలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పౌరుడు రాజ్యాంగ పరిరక్షణ కోసం సంఘటితంగా పోరాటం చేయాలని, సమానత్వం, స్వేచ్ఛ విలువలను కాపాడుకుంటూ బలమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.