
గోదావరిఖని, వెలుగు: ఎలాంటి కటింగ్ లేకుండా కొనుగోలు సెంటర్ల ద్వారా ప్రభుత్వం వడ్లు కొంటోందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్తెలిపారు. శుక్రవారం పాలకుర్తి మండలం బసంత్‌నగర్, పాలకుర్తి, గుంటూరుపల్లి, ఎల్కలపల్లి, కొత్తపల్లి, రామారావుపల్లి, తక్కలపల్లి, పుట్నూర్, గుడిపల్లి, జయ్యారం, కుక్కలగూడూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు సెంటర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళారులు లేకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనుగోలు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం పాలకుర్తి మండలం జయ్యారం గ్రామంలో లబ్ధిదారుల ఇంటిలో ఎమ్మెల్యే సన్నం బియ్యంతో వండిన భోజనం చేశారు.
48 గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు
సుల్తానాబాద్, వెలుగు: వడ్లు అమ్మిన 48 గంటల్లోగా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు.సుల్తానాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం సింగిల్ విండో, ఐకేపీల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు సెంటర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వడ్ల కొనుగోళ్ల విషయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలోనే అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. కార్యక్రమాల్లో లైబ్రరీ సంస్థ జిల్లా చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, సింగిల్ విండో చైర్మన్‌లు శ్రీగిరి శ్రీనివాస్, సందీప్ రావు, కోట వీణ పాల్గొన్నారు.
చొప్పదండి, వెలుగు: తాలు, తప్ప పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని, కోతలు లేకుండా వడ్లు కొనుగోలు చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అధికారులకు సూచించారు. చొప్పదండి మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ, ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు సెంటర్లను ప్రారంభించారు. అనంతరం వెదురుగట్టలో కాంగ్రెస్ శ్రేణులతో కలసి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్మన్ కొత్తూరు మహేశ్, కొండగట్టు దేవస్థాన ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, లీడర్లు, రైతులు పాల్గొన్నారు.