
మయన్మార్ భూకంపం ప్రపంచంలో ఒక్కసారిగా అలజడి సృష్టించింది. ముఖ్యంగా ఆసియా దేశాలను ఆందోళనకు గురి చేసింది. శుక్రవారం (మార్చి 28) వరుస భూకంపాలు మయన్మార్ ను నేలమట్టం చేశాయి. భవనాలు, బ్రిడ్జిలు కూలిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ భారీ భూకంపాలు మయన్మార్ పొరుగున ఉన్న థాయ్ లాండ్ ను కూడా తాకాయి. దీంతో థాయ్ లాండ్ లో కూడా భవనాలు కంపించి ప్రాణ ఆస్తి నష్టాలు వాటిల్లాయి.
థాయ్ లాండ్ లో భూకంపం సంభవించడంతో రామగుండం ప్రజలు ఆందోళనకు గురయ్యారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కుంటుంబం ఇటీవలే థాయిలాండ్ పర్యటనకు వెళ్లటమే అందుకు కారణం. ఎమ్మెల్యే భార్య, ముగ్గురు పిల్లలు పర్యటనలో ఉండటం స్థానికంగా ఆందోళన కలిగించింది.
అయితే ఈ ప్రమాదంపై సమాచారం అందించారు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు. ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారని, అందరూ సేఫ్ గా ఉన్నారని ఎమ్మెల్యే ప్రకటించారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఆయన ఎయిర్ పోర్ట్ కు పయనమయ్యారు. ఫ్యామిలీని కలిసేందుకు థాయ్ లాండ్ కు వెళ్లనున్నారు.