ఊళ్లను కమ్మేస్తున్న ఎన్టీపీసీ బూడిద

ఊళ్లను కమ్మేస్తున్న ఎన్టీపీసీ బూడిద
  • కుందనపల్లి శివారులో మూడు వేల ఎకరాల్లో ఫైయాష్‌‌ చెరువులు
  • ఈదురుగాలుల కారణంగా గాలిలో కలుస్తున్న బూడిద
  • గ్రామాలపై కమ్మేస్తుండడంతో ఇబ్బందులు పడుతున్న నాలుగు గ్రామాల ప్రజలు
  • చర్మ, శ్వాసకోశ వ్యాధుల బారిన గ్రామస్తులు
  • మరోచోట పునారావాసం కల్పించాలంటున్న కుందనపల్లివాసులు

గోదావరిఖని, వెలుగు : రామగుండం ఎన్టీపీసీ నుంచి వెలువడుతున్న బూడిద సమీప గ్రామాల ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. గాలికి బూడిద పైకి లేవకుండా చర్యలు తీసుకోవాల్సిన ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గాలిలో కలిసిన ఈ బూడిదను పీలుస్తున్న ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారు. సమస్య నుంచి బయటపడేందుకు తమకు పునరావాసం కల్పించాలని పలువురు గ్రామస్తులు గత ప్రభుత్వ హయాంలోనే రిలే దీక్షలు చేపట్టారు. అయినా పట్టించుకునే వారే కరువయ్యారు.

మూడు వేల ఎకరాల్లో బూడిద నిల్వ

రామగుండం ఎన్టీపీసీలో బొగ్గును మండించడం ద్వారా ఏర్పడే ఫ్లైయాష్‌‌ను నిల్వ చేసేందుకు కుందనపల్లి శివారులో మూడు వేల ఎకరాల్లో బూడిద చెరువులను ఏర్పాటు చేశారు. ఎన్టీపీసీ నుంచి వెలువడిన బూడిదను వాటర్‌‌తో మిక్స్‌‌ చేసి పైప్‌‌లైన్ల ద్వారా ఈ చెరువుల్లోకి తరలిస్తారు. అక్కడికి చేరిన బూడిద బరువు కారణంగా కిందకు వెళ్లడంతో  పైకి తేలిన నీటిని మోటర్ల ద్వారా బయటకు పంపింగ్‌‌ చేస్తారు. ఆ తర్వాత కేవలం బూడిద మాత్రమే చెరువుల్లో నిల్వ ఉంటుంది. అది పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఇటుక బట్టీలు, రోడ్ల నిర్మాణానికి తరలిస్తుంటారు.

ఇబ్బందుల్లో నాలుగు గ్రామాల ప్రజలు

ప్రస్తుతం ఈదురుగాలులు వీస్తుండడంతో కుందనపల్లి శివారులోని బూడిద పెద్ద మొత్తంలో గాలిలో కలుస్తోంది. దీంతో కుందనపల్లితో పాటు బద్రిపల్లి, అక్బర్‌‌నగర్‌‌, రామగుండం రైల్వే స్టేషన్‌‌ ప్రాంతాలను పూర్తిగా కమ్మేస్తోంది. ఈ బూడిద కారణంగా రామగుండం రైల్వే స్టేషన్‌‌లో సిగ్నల్స్‌‌ కూడా సరిగా కనిపించడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెల్లారి లేచి చూసే సరికి ఇంటి ఆవరణలోని దుస్తులు, ఇతర సామాన్లపై బూడిద విపరీతంగా పేరుకుపోతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనారోగ్యం బారిన గ్రామస్తులు

యాష్‌‌ పాండ్‌‌లోని బూడిద గాలి ద్వారాపైకి లేవకుండా ఎన్టీపీసీ మేనేజ్‌‌మెంట్‌‌ స్పింక్లర్లను ఏర్పాటు చేసి వాటర్‌‌ను స్ర్పే చేయాల్సి ఉంటుంది. కానీ ఆ సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం వ్యవహరించడం నాలుగు గ్రామాల ప్రజలకు సమస్యగా మారింది. ఈ విషయంపై స్థానికులు ఇటీవలే అడిషనల్‌‌ కలెక్టర్‌‌ అరుణశ్రీకి సైతం ఫిర్యాదు చేశారు. దీనికి తోడు వానాకాలంలో యాష్‌‌ పాండ్‌‌లో నుంచి వచ్చే నీరు కాల్వల ద్వారా నివాస ప్రాంతాల్లోని బావుల్లోకి చేరుతుంది. గాలిలో కలిసిన దుమ్మును పీల్చడం వల్ల శ్వాస సంబంధ వ్యాధులు వస్తుండగా, బూడిద కలిసిన నీటిని తాగడం వల్ల ప్రజలు చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు. ఆఫీసర్లు స్పందించి తమకు మరోచోట పునరావాసం కల్పించాలని కుందనపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.

అనారోగ్యం బారిన పడుతున్నం 

ఎన్టీపీసీ అవసరాల కోసం కుందనపల్లి, మొగల్‌‌పహాడ్‌‌, తదితర గ్రామాలకు చెందిన భూములను అప్పగించాం. ఎన్టీపీసీతో తమ బతుకుల్లో వెలుగులు నిండుతాయని భావిస్తే దానికి విరుద్ధంగా బూడిదతో అనారోగ్యం బారిన పడుతున్నాం. ఇంటి ఆవరణలోని బట్టలు, సామానులపై బూడిద పేరుకుపోతోంది. ఎన్టీపీసీ స్పందించి భారీ సంఖ్యలో స్ర్పింక్లర్లను ఏర్పాటు చేసి బూడిద పైకి లేవకుండా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం స్పందించి ఎన్‌‌టీపీసీ మేనేజ్‌‌మెంట్‌‌తో మాట్లాడాలి. -‌‌‌‌ - -  కన్నూరి సతీశ్‌‌కుమార్‌‌, కార్పొరేటర్, రామగుండం