- రామగుండం ఎన్టీపీసీ కొత్త ప్లాంట్‌లో
- కరెంటు ఉత్పత్తి షురూ
- 800 మెగావాట్ల ఫస్ట్ యూనిట్‌లో సింక్రనైజేషన్
- ఉత్పత్తి చేసిన దాంట్లో 90 శాతం తెలంగాణకే
- రాష్ట్రానికి రూ.5 కు యూనిట్ కరెంటు
గోదావరిఖని/జ్యోతినగర్, వెలుగు: రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్(టీఎస్‌టీపీపీ) ప్లాంట్‌లోని మొదటి 800 మెగావాట్ల యూనిట్‌లో శుక్రవారం తెల్లవారుజామున కరెంటు ఉత్పత్తి ప్రారంభమైంది. బాయిలర్‌ను వెలిగించిన తర్వాత సింక్రనైజేషన్ చేశారు. విభజన చట్టంలో రామగుండం ఎన్టీపీసీ వద్ద 4000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మించాలని పేర్కొన్నారు. ఆ హామీలో భాగంగా తొలుత 800 మెగావాట్ల రెండు యూనిట్లు నిర్మించగా, అందులో మొదటి యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది.
అర్ధరాత్రి దాటిన తర్వాత
తెలంగాణ ప్లాంట్‌లోని మొదటి యూనిట్‌లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత శుక్రవారం 0.53 గంటలకు విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి గ్రిడ్‌కు కనెక్షన్కలిపారు. యూనిట్‌లో నిరంతరం విద్యుత్ ఉత్పత్తి కోసం బాయిలర్, టర్బైన్ ఆక్సిలరీలు, బొగ్గు, బూడిద, నీళ్లు, తదితర నిర్వహణ వ్యవస్థలు కొనసాగేలా మేనేజ్‌మెంట్ చర్యలు తీసుకున్నది. పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా ఈ ప్లాంట్‌లో యూనిట్ కంట్రోల్ సిస్టమ్, కంట్రోల్ రూమ్ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్(జీఐఎస్), ప్లాంట్‌లోని అన్ని బిల్డింగ్‌లపై రూఫ్ టాప్ సోలార్ ఇన్‌స్టలేషన్ సిస్టమ్, బుడిద బయటకు పంపించేందుకు హై సెంట్రలైజ్డ్ స్లర్రీ డిస్పోజల్(హెచ్‌సీఎస్‌డీ) వ్యవస్థలను రూపొందించారు. నీటి వినియోగాన్ని తగ్గించడం కోసం ఫ్లూ గ్యాస్ డి‒సల్ఫరైజేషన్(ఎఫ్‌జీడీ) చేపట్టారు. దీనివల్ల ఉపయోగించిన నీటిని రీ సైకిల్ చేస్తూ ఉద్యానవనాలకు వాడుకునేలా ఏర్పాట్లు చేశారు. మొదటి యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి సక్సెస్ చేసిన ఆఫీసర్లు, ఉద్యోగులను రామగుండం ఎన్టీపీసీ సీజీఎం సునీల్ కుమార్ అభినందించారు.
ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం రూ.10,599 కోట్లు
టీఎస్‌టీపీపీలో ముందుగా 1,600 (800 మెగావాట్ల రెండు యూనిట్లు) మెగావాట్ల మొదటి దశ ప్లాంట్‌ను పూర్తి చేశారు. ఇందుకోసం కేంద్రం రూ.10,599 కోట్లు రిలీజ్ చేసింది. 2016 ఆగస్టు 7న ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.