గోదావరిఖని, వెలుగు : పాత మొబైల్స్‌ను కొంటూ, సైబర్ నేబర్ నేరగాళ్లకు అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను రామగుండం సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నాలుగు వేల ఫోన్లు, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను రామగుండం పోలీస్ కమిషనరేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి వెల్లడించారు. బీహార్ రాష్ట్రంలోని హతియా దియారా ప్రాంతానికి చెందిన ఎండీ.షమీమ్, అబ్దుల్ సలాం, ఎండీ ఇఫ్తికార్ గోదావరిఖని ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్‌లో పాత మొబైల్స్ తీసుకొని ప్లాస్టిక్ వస్తువులు, డబ్బులను ఇస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సైబర్ సెక్యూరిటీ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
వారిని సోదా చేయగా సుమారు నాలుగు వేల సెల్‌ఫోన్లు దొరికాయి. రామగుండం, చుట్టు పక్కల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సెల్‌ఫోన్లను కొని బీహార్‌కు తరలించాలని చూస్తున్నట్లు నిందితులు తెలిపారు. తమ గ్రామానికి చెందిన అక్తర్ అనే వ్యక్తి ద్వారా జార్ఖండ్‌లోని జమ్తారా, దియోఘర్ తదితర ప్రాంతాల్లోని సైబర్ నేరగాళ్లకు మొబైల్స్‌ను సరఫరా చేస్తుంటారని నిందితులు చెప్పినట్లు ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు ఆయన చెప్పారు.