- పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన సీపీ
నెట్వర్క్, మంచిర్యాల, వెలుగు : చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ యాక్ట్ పెడతామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు హెచ్చరించారు. సోమవారం ఆయన డీసీపీ అశోక్ కుమార్ తో కలిసి మంచిర్యాల సబ్ డివిజన్ పరిధిలో సుడిగాలి పర్యటన చేశారు. హాజీపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం, నస్పూర్ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు రిసెప్షన్ సెంటర్ పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు.
అధికారులు, సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయి, వాటిని ఏవిధంగా కంట్రోల్ చేస్తున్నారు అని ఆరా తీశారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవరిస్తూ త్వరగా పరిష్కరించాలన్నారు. పెట్రోలింగ్ పకడ్బందీగా నిర్వహిస్తూ నేరాలను కంట్రోల్ చేయాలని ఆదేశించారు. ఇంటర్ పరీక్షల కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలీసులు గంట ముందేవచ్చి కేంద్రాల చుట్టూ తనిఖీలు చేపడుతున్నారని చెప్పారు.
పీడీఎస్ అక్రమ రవాణా, గుడుంబా, గంజాయి రవాణాపై నిఘా ఉందన్నారు. అక్రమ దందాలను అరికట్టేందుకు స్థానిక పోలీసులు, టాస్క్ ఫోర్క్ టీమ్లు పనిచేస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే పీడీఎస్ రైస్ అక్రమ రవాణా చేసే వారిపై కేసులు పెట్టామన్నారు. పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతలను కాపాడాలని, ప్రజల్లో పోలీసులు మంచి పేరు సంపాదించడమే రామగుండం కమిషనరేట్ లక్ష్యమన్నారు. మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, ఏసీపీ ఆర్.ప్రకాశ్, ఆయా పోలీస్స్టేషన్ల సీఐలు, ఎస్లు పాల్గొన్నారు.