మంచిర్యాల, వెలుగు: పోలీస్ వృత్తి ఉన్నతమైందని, నిరంతరం ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాసులు అన్నారు. హాజీపూర్ మండలం గుడిపేటలోని 13వ బెటాలియన్ లో స్టయిఫండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్ బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రాంను గురువారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కష్టపడి పోలీస్ ఉద్యోగాలు సాధించిన మీరు ఇక్కడే ఆగిపోకుండా ఇంకా ఉన్నతమైన స్థాయికి చేరుకొని తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలన్నారు. స్వీయ క్రమశిక్షణ పాటించి, ట్రైనింగ్ విజయవంతంగా పూర్తిచేసి యూనిట్ కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. సమర్థత, వృత్తి నైపుణ్యం, నీతి నిజాయతీతో విధులు నిర్వర్తించాలన్నారు.
అనంతరం శిక్షణకు సంబంధించిన పుస్తకాలను అభ్యర్థులకు అందించారు. బెటాలియన్ కమాండెంట్ సయ్యద్ జమీల్ బాష, మంచిర్యాల ఏసీపీ రత్నపురం ప్రకాశ్, అసిస్టెంట్ కమాండెంట్ రఘునాథ్ చౌహాన్, యూనిట్ మెడికల్ డాక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు.