చెన్నూరులో 10 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్​

  •     రూ.14.48 లక్షలు స్వాధీనం

గోదావరిఖని, వెలుగు : మంచిర్యాల జిల్లా చెన్నూరులో పేకాట ఆడుతున్న 10 మందిని రామగుండం టాస్క్​ఫోర్స్​ పోలీసులు అరెస్ట్​ చేసి వారి వద్ద నుంచి రూ.14.48 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ ఎం.శ్రీనివాస్‌ తెలిపారు. మంగళవారం రాత్రి రామగుండం కమిషనరేట్‌లో ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. చెన్నూరు పీఎస్‌ పరిధిలోని అస్నాద్​ గ్రామ శివారు మామిడి తోటలో కొందరు వ్యక్తులు పందెం పెట్టుకుని పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో టాస్క్​ఫోర్స్​ సీఐ సంజయ్

ఎస్ఐ ఉపేందర్​ ఆధ్వర్యంలో దాడులు చేసి 10 మంది పేకాటరాయుళ్లను పట్టుకున్నట్టు సీపీ తెలిపారు. సందెల తిరుపతి, అన్నాల తిరుపతి, చోటు, మరికొందరు కలిసి ముఠాగా ఏర్పడి పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్​, కరీంనగర్​, ఆసిఫాబాద్​ తదితర ఏరియాలకు చెందిన పేకాటరాయుళ్లను పిలిపించి అటవీ ప్రాంతాలలో పేకాట స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారని సీపీ చెప్పారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.